ప్రమాదమని తెలిసినా పట్టించుకోరేమి…

రాయపోల్, ఆంధ్రప్రభ : పంటల విక్రయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పండించిన ధాన్యాన్ని టాటా ఏసి వంటి చిన్న వాహనాల్లో నింపుకుని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ఈ తరలింపు క్రమంలో వాహనాలపై సామర్థ్యానికి మించి సరుకును ఎక్కించడం,వాటిపైనే కూలీలను కూర్చోబెట్టడం ప్రమాదాలకు దారి తీస్తోంది.పంటలతో నిండిన వాహనాలపై కూలీలు ప్రయాణిస్తూ సంతులనం కోల్పోయి కింద పడిన ఘటనలు ఇప్పటికే చోటు చేసుకున్నాయి.
కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలకు గురైన సంఘటనలూ నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రమాదకర ప్రయాణాలపై రైతులు, వాహనదారులు నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తున్నారు.ముఖ్యంగా గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రాల వరకు రహదారులపై ఈ తరహా వాహనాల రాకపోకలు నిత్యకృత్యంగా మారాయి.
రద్దీగా ఉన్న రహదారులపై ఇలా ప్రయాణించడం వాహనదారులకే కాకుండా ఇతర ప్రయాణికులకు కూడా ముప్పుగా మారుతోంది.ఈ పరిస్థితిపై పోలీసులు,సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పంటల తరలింపులో భద్రతా నియమాలు పాటించేలా రైతులు, వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు, ప్రమాదకరంగా ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
