విజయవాడలో ఉగ్రవాద ముఠా భగ్నం

విజయవాడలో ఉగ్రవాద ముఠా భగ్నం

సోషల్ మీడియా ద్వారా యువతను లక్ష్యంగా చేసుకున్న ముగ్గురు అరెస్ట్
ఐసిస్, ఏక్యూఐఎస్ సిద్ధాంతాల ప్రచారం…
విదేశీ లింకులు, డిజిటల్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు ముమ్మరం
5 ప్రాంతాల్లో 9 బృందాల సోదాలు
ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం, ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఇన్‌చార్జ్ సీపీ త్రిపాఠి తెలిపారు. మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, దానిష్, మీర్జా సుహైబ్‌లను అదుపులోకి తీసుకుని, వారి పై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (UAPA) కింద విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో, నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ప్రత్యేక గ్రూపుల ద్వారా చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. వాటిలో ఒకటి ISIS సిద్ధాంతాలపై, మరొకటి AQIS పేరుతో నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్రూపుల ద్వారా తీవ్రవాద కంటెంట్‌ను పంచుతూ, సులభంగా ప్రభావితమయ్యే యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. నిందితులకు విదేశాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసుల సోదాల్లో మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ఫోరెన్సిక్ విశ్లేషణ కొనసాగుతోందని తెలిపారు.


ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ, 5 ప్రాంతాల్లో 9 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు లావాదేవీలు జరిగాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.అరెస్టైన ముగ్గురు విజయవాడకు చెందినవారని, మిగిలిన నెట్‌వర్క్ సభ్యులు తెలంగాణ, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించినట్లు వెల్లడించారు. రహమతుల్లా, సుహైబ్ ఇద్దరూ ఒకే డిగ్రీ కళాశాలలో చదివిన స్నేహితులని పేర్కొన్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలను కఠినంగా అణచివేస్తామని పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై పర్యవేక్షణ పెంచాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు యువత లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply