ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
వివాహాల సీజన్ తో పెరిగిన భక్తుల రాక.
రద్దీకి తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు
అంతరాలయ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత..
విఐపి సిఫార్సు దర్శనాలు రద్దు..
రద్దీని క్రమబద్ధీకరించిన ఈవో
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వివాహాల సీజన్, వేసవి రద్దీ కారణంగా భక్తుల రాకపోకలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ వేసవి సెలవులు ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి రూ.500 ప్రత్యేక దర్శన టికెట్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసి, అంతరాలయ దర్శనాన్ని కూడా నిలిపివేశారు. క్యూ లైన్ల క్రమబద్ధీకరణతో పాటు రద్దీ నియంత్రణకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయం పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ఉదయం 9 గంటల నుంచి వివిధ ప్రాంతాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ సేకరించారు. శివాలయానికి వెళ్లే మార్గంలో నీరు నిల్వ ఉండటం, కొండ ప్రాంతంలో చెత్త పేరుకుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి, వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర రాజధానిలోని ఈ ప్రాచీన దేవాలయ వారసత్వాన్ని కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఈఓ తెలిపారు. భక్తుల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ యాగశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి, భక్తుల సంతృప్తి స్థాయి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

