బాసరలో దేవాదాయశాఖ కమిషనర్ పర్యటన..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈనెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.

వచ్చే సంవత్సరం జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలు, అలాగే రూ.100 కోట్లతో చేపట్టనున్న బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై కమిషనర్ అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన స్థలాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.

అనంతరం గోదావరి నది తీరంలోని ఘాట్లను సందర్శించి, 2027 జూన్‌లో జరిగే పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అమ్మవారిని దర్శించిన కమిషనర్:
పర్యటనలో భాగంగా కమిషనర్ హనుమంతరావు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కుంకుమార్చన చేసి హారతి ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో విజయరామారావు కమిషనర్‌ను పట్టు వస్త్రాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply