ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంట‌ర్

  • ఆరుగురు మావోయిస్టుల మృతి

చ‌ర్ల‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ప‌ది గంట‌ల‌ నుండి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం ఆధారంగా, డీఆర్‌జీ ( బీజాపూర్), డీఆర్‌జీ (దంతెవాడ), ఎస్‌టీఎఫ్‌ సంయుక్త బృందం ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సమయంలో ఉదయం ప‌ది గంట‌ల‌కు మావోయిస్టులు తార‌సు ప‌డ‌డంతో వారి మ‌ధ్య ఎదురు కాల్పులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఇప్పటివరకు, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు ల‌భించాయి.

అలాగే ఆటోమేటిక్ ఆయుధాలు (ఇన్సాస్‌), స్టెన్‌గన్, 303 రైఫిల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామగ్రిని ఎన్‌కౌంటర్ స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పి. మాట్లాడుతూ మంగ‌ళ‌వారం జరిగిన ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టు క్యాడర్లు మృతి చెందిన‌ట్లు వెల్ల‌డించారు. పరారీలో ఉన్న మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, బ‌స్త‌ర్ ఫైట‌ర్స్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఏఎఫ్ ద‌ళాలు గాలిస్తున్నాయ‌ని తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నందున మ‌రిన్ని వివ‌రాలు త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌న్నారు.

Leave a Reply