ఏలూరు: ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్‌కు శిక్షణ ఇస్తామని మాటిచ్చారు. ప్రతీ ఏడాది రూ.1000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఏలూరు జిల్లాలోని అగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నేడు చంద్రబాబు పర్యటించారు. ముందుగా ఆయన సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి వేడుకలలో పాల్గొన్నారు.. పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.. పి 4 లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్ఠాల్స్ ను ఆయన పరిశీలించారు.. ఆక్కడ ఉన్న లబ్ధిదారులతో మాట్లాడారు.. అక్కడే ఉన్న ట్రాక్టర్ చంద్రబాబు స్వయంగా నడిపారు.
అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు లాంచనంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకోవడం ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఆయన జయంతిని వాడవాడలా చేస్తున్నామంటే, ఆయన స్పూర్తి ఎంతో తెలుస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల కోసం జ్యోతిరావు పూలే పోరాడారని ఉద్ఘాటించారు. మన రాష్ట్రంలో మహిళల చదువు ఆవశ్యకతను గుర్తించి మహిళా యూనివర్సిటీని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మూఢ నమ్మకాలపై జ్యోతిరావు పూలే రాజీలేని పోరాటం, ఉద్యమాలు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు.
త్వరలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నామని చంద్రబాబు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామని అన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకువచ్చామని చెప్పారు. అన్నివర్గాల కంటే మిన్నగా బీసీవర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇవాళ(శుక్రవారం) విదేశాల్లో చదువుకోవాలనే వారికి ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.
టీడీపీ వచ్చేంతవరకు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని అన్నారు. వారికి న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీనేనని తెలిపారు. టీడీపీకి వెన్నెముక బలహీన వర్గాలు.. అలాంటి వారిని పూర్తిగా ఆదుకుంటామని సీఎం మాటిచ్చారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేలు గౌరవ వేతనం ఇస్తున్నామని ప్రకటించారు. బీసీల రిజర్వేషన్లను 26 నుంచి 34 శాతం పెంచడానికి చర్యలు చేపట్టామని అన్నారు. బీసీల రక్షణకు చట్టం రూపొందించడానికి ఒక కమిటీని వేశామని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే చట్టం తీసుకువస్తామని తెలిపారు. నూజివీడును పూర్తిగా అభివృద్ధి చేసేందుకు మంత్రి పార్థసారథికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అప్పులు చేసి అవినీతికి పాల్పడితే ఆ సమాజం మనుగడ సాగదని చెప్పారు. అన్ని చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టె ఖాళీ అయ్యిందన్నారు.
అప్పులు అడగాలంటే ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ చూస్తే, ఎక్కడ చేసినా తానే కనిపిస్తానని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు పెట్టాను..ఒక్కొక్కటికీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలు తానే పెట్టాను..పొదుపు సంఘాలు తానే ప్రారంభించానని గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని ఉద్ఘాటించారు. రేపో ఎల్లుండో తల్లికి వందనం ఇస్తున్నామని.. ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తామని తెలిపారు. మన రాష్ట్రంలో సంతాన రేటు 1:1.5 రేషియాలో ఉందన్నారు. 2035 నాటికి ఇలాగే జనాభా తగ్గిపోతుందని చెప్పారు. అందుకే సంతాన రేటు రెండుకు పెరగాలని అన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌ను తానే పూర్తి చేస్తానని మాటిచ్చారు. మే నుంచి రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తే, రాష్ట్రం రూ.14 వేలు ఇస్తుందని.అది మూడు విడతలగా ఇస్తామని స్పష్టం చేశారు.
బూతులు తిట్టారు..
అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారు..తనను బూతులు తిట్టారని చెప్పారు చంద్రబాబు. అది గౌరవసభ కాదు, కౌరవ సభ అని అప్పుడే చెప్పా.. సీఎంగా అడుగు పెడతానని చెప్పానని.. అలాగే అసెంబ్లీకి వచ్చానని గుర్తుచేశారు. ఆడపిల్లల క్యారెక్టర్‌ను హననం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో దారుణంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిను హత్య చేసి గుండెపోటు అన్నారని.. తప్పులు చేసే వారిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం వెళ్లి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇంతకుముందు వైసీపీ హయాంలో తనను కూడా రాష్ట్రంలో తిరగనివ్వలేదని చెప్పారు. ఇప్పుడు స్వేచ్ఛగా తిరగనిస్తుంటే, రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. నేరాలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పీ4 విధానంతో అందరి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. డబ్బులు, సంపద అనేది అందరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదిగా ఉండాలని తెలిపారు. ఒకరివద్దే సంపద ఉండిపోకూడదని.. మరొకరు డబ్భులు లేకుండా, చదువు లేకుండా ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
హెలిప్యాడ్ వద్ద ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్వాగతం

నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో జీరో పావర్టీ-పీ4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఘన స్వాగతం పలికారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ముఖ్యమంత్రి కి పుష్పగుచ్చం అందజేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.