Elephant Attack : అన్నమయ్య జిల్లాలో గజరాజుల బీభత్సం – ముగ్గురు మృతి

స్పాట్‌లోనే ముగ్గురు మృతి
మరో ముగ్గురికి తీవ్రగాయాలు
అన్న‌మ‌య్య జిల్లాలో ఘ‌ట‌న‌
తిరుపతి రుయాకు క్షతగాత్రుల తరలింపు
మృతుల కుటుంబాలకు ₹10 లక్షల పరిహారం
సీఎం చంద్రబాబు.. డీప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రభ, ఓబులవారిపల్లె/ అన్నమయ్య బ్యూరో : మహా శివరాత్రి రోజున జాగారణకు భయలుదేరిన శివభక్తులపై ఎనుగులు దాడి చేశాయి. దొరికినోళ్లను దొరినట్టు తొక్కి చంపేశాయి. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఏనుగుల బీభత్సకాండలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తీవ్ర దుర్ఘటన తీవ్రసంచలనం రేపింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలోని వై కోట అడవుల్లోని తరతరాల కిందటి శివాలయం ఉంది. అక్కడ ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాలలోని దాదాపుగా అన్ని మండలాల నుంచి వేలాది మంది భక్తులు అక్కడికి హాజరవుతారు. ఒకరోజు ముందుగానే ఓబులవారిపల్లి మండలం ఉర్లగట్టు పోడు, కన్నె కుంట ఎస్టీ కాలనీ ప్రాంతాల నుంచి సుమారు 30 మంది జట్టుగా ఏర్పడి గుండాలకోనకు బయలుదేరారు.

అట‌వీశాఖ అధికారులు హెచ్చ‌రించినా..

అడవిలో ఏనుగులు ఉన్నాయన్న సంగతిని దృష్టిలో ఉంచుకొని అటవీశాఖ అధికారులు సాధారణంగా ఈ మార్గం నుంచి వెళ్లకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎలాగైనా గుండాలకోన చేరుకోవాలని మరొక దారిని ఎంచుకొని రాత్రిపూట బయలు దేరారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ అడవిలో తిరుగుతున్న ఏనుగుల గుంపు కంటపడ్డారు. అప్పటికే అక్కడ సంచరిస్తున్న ఏనుగుల గుంపు తమ పిల్లలతో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. తమపై ఏనుగులు దాడి చేస్తాయని గ్రహించిన కొందరు తమ వద్ద ఉన్న డబ్బాలు, పాత్రలతో చప్పుడు చేయగా ఏనుగుల గుంపు ఒక్కసారిగా విజృంభించి బాటసారుల మీద దాడి చేయడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. కన్నేకుంట ఎస్టి కాలనీకి చెందిన తిరుపతి చంగలరాయలు (38), తుపాకుల మణెమ్మ (40) అనే కన్నేకుంట ఎస్టి యానాదులు, ఉర్లగట్టు పోడు అరుంధతి వాడకు చెందిన వంకాయల దినేష్ (34) అక్కడికక్కడే మృతి చెందారు. అమ్ములు, పరిగెల రాజశేఖర్ సహా ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు పంపించారు. ఈ సంఘటనపై స్పందించిన కోడూరు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మహేష్ నాయుడు బందోబస్తు నిర్వహించి ఆలయానికి వెళ్లే దారిని మూసివేశారు.

రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా .. డీఎఫ్ వో జగన్నాథ్ సింగ్

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలో శేషాచలం అడవుల్లో జరిగిన ఏనుగుల దాడిలో మృతి చెందిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ప్రకారం ఎక్స్ గ్రేషియోను ప్రకటించినట్టు అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ తెలిపారు. సంఘటన సందర్భంగా ఆయన ఆంధ్ర ప్రభ తో మాట్లాడుతూ గుండాల కోన ప్రాంతంలో ఏనుగులు ఉన్న సంగతిని ముందుగానే ప్రజలకు తెలియజేశామన్నారు. సోమవారం సాయంత్రమే గుండాలకోనకు వెళ్లడానికి వీరు ప్రయత్నించగా నివారించామని, తమకు తెలియకుండా వేరొక దారిన అడవిలో ప్రవేశించి ఏనుగులు ఉండే ప్రాంతానికి చేరడంతోనే వారిపై దాడి జరిగిందని నిర్ధారించారు. గాయపడిన వారికి కూడా ఒక్కొక్కరికి రూ.2 లక్షల ప్రకారం ఆర్థిక సహాయాన్ని ప్రకటించామన్నారు

ప్రతి ఏటా పంటలను ధ్వంసం చేస్తుంటాయి

  • స్థానిక సర్పంచ్ మల్లెం ఈశ్వరయ్య

ఎర్రగుంట కోటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో శేషాచలం అడవుల్లో ఉన్న తరతరాల నాటి గుండాల కోనకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వెళుతుంటారు. అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఆలయాన్ని పద కవితా పితామహుడు అన్నమాచార్యులు కూడా సందర్శించారని చెబుతుంటారు. ఆలయంలో శివరాత్రి పూట మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అటవీ శాఖ వారి అనుమతితో అక్కడికి వెళుతూ ఉంటాం. ఏనుగులు ఉన్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు ప్రతి సంవత్సరం పొలాల్లోకి వచ్చి కొంత పంట నష్టాన్ని కూడా చేస్తుంటాయి. సోమవారం రాత్రి జరిగిన సంఘటన వారు వేరొక దారిన గుండాలకోనకు చేరుకోవాలని చేసిన ప్రయత్నమే. ఏనుగులున్న ప్రాంతానికి వెళ్లడంతోనే ఈ ఘటన జరిగింది.

సీఎం..డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ముగ్గురు భక్తులను చంపేయడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు చంద్రబాబు, పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున డిప్యూటీ సీఎం పవన్ ఆర్థికసాయం ప్రకటించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి ఫోన్ చేసి పవన్ వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *