విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలి…

విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలి…

కర్నూలు బస్టాండ్‌లో రవాణా కార్మికుల ధర్నా

కర్నూలు, ఆంధ్రప్రభ : విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రవాణా రంగ కార్మికులు మంగళవారం కర్నూలు బస్టాండ్ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF) అఖిలభారత కమిటీ పిలుపుమేరకు సీఐటీయూ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది.

ఈ సందర్భంగా సీఐటీయూ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ పూర్వ రాష్ట్ర కోశాధికారి జె. దివాకర్, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్ మాట్లాడుతూ విద్యుత్ బస్సుల విధానం అమలుతో ఆర్టీసీ మనుగడకే ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటికే విద్యుత్ బస్సులను పినాకల్ సంస్థకు అప్పగించడం ద్వారా ఆ ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బస్సుల పథకాలు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) విధానంలో అమలవుతున్నాయని, ఇందులో బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ వంటి బాధ్యతలన్నీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకే అప్పగించబడుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీకి కేవలం రూట్లు నిర్ణయించడం, టికెట్ల ద్వారా ఆదాయం సమకూర్చడం, ఒప్పందం ప్రకారం ప్రతి నెలా కంపెనీలకు చెల్లింపులు చేయడం మాత్రమే మిగులుతుందని తెలిపారు. దేశంలో మొత్తం 42 కోట్ల వాహనాలు ఉన్నప్పటికీ అందులో ఆర్టీసీ బస్సులు కేవలం 1.4 లక్షలే ఉన్నాయని, కాలుష్య నియంత్రణ కోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

నితి ఆయోగ్ అంచనాల ప్రకారం దేశానికి తక్షణం కనీసం రెండు లక్షల బస్సులు అవసరమని తెలిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్లు, మౌలిక వసతుల పేరుతో ఆర్టీసీకి చెందిన భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమిళనాడులో ఐదు డిపోలు, ఆంధ్రప్రదేశ్‌లో 19 డిపోలను ప్రైవేట్ విద్యుత్ బస్సుల సంస్థలకు అప్పగించే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ వద్ద సుమారు 1800 ఎకరాలు, టీఎస్‌ఆర్టీసీ వద్ద 1429 ఎకరాల భూమి ఉందని, ఈ భూములు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో ఆర్టీసీ విస్తరణకు అవకాశం ఉండదని హెచ్చరించారు.

విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలను ఆర్టీసీలకే అప్పగించేలా కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే సబ్సిడీలను ఆర్టీసీలకే ఇవ్వాలని, బస్సుల కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చాలని కోరారు. అలాగే ప్రజారవాణా విస్తరణ కోసం బస్సుల సంఖ్యను పెంచాలని, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని నియంత్రించే విధానాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ఎస్‌.ఆర్‌.కె. రెడ్డి, ఆర్‌.ఎల్‌. నాయుడు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు శంకరయ్య, ప్రతాప్, అమర్‌నాథ్ తదితరులు నాయకత్వం వహించారు.

Leave a Reply