హైదరాబాద్ లో సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈ డీ అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ కంపెనీల ఛైర్మన్ నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళల్లో, ఆఫీస్ లలో తనిఖీలు జరుగుతున్నాయి..
చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారన్న అనుమానంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. మొత్తం రెండు టీములతో ఈడీ సోదాలు చేసింది. బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి.
రుణాలు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు..సురానా గ్రూపు చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను పొందింది. కానీ వాటిని చెల్లించకుండా రుణాలను ఎగ్గొట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో పాటూ మనీలాండరింగ్తో పాటు విదేశాలు డబ్బులు తరలించినట్లు ఆరోపణలున్నాయి.
ఇంతకు ముందు సురానా గ్రూప్స్ పై సీబీఐ కేసు కూడా నమోదైంది. ఈ కారణంగానే సురానా అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలప్ మెంట్స్ కంపెనీ ఆఫీసుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల ఆర్థిక లావాదేవీలు, అప్పులు లాంటి వాటిపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.