e-Sakshya | సాక్ష్యాలు తారుమారు కాకుండా..

e-Sakshya | సాక్ష్యాలు తారుమారు కాకుండా..
- అందుబాటులోకి ఈ-సాక్ష్య పోలీస్ యాప్
- జిల్లా పోలీసు కార్యాలయంలో అవగాహన
e-Sakshya | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని పోలీసు సిబ్బందికి ఈ-సాక్ష్య (e-Sakshya) పోలీసు యాప్ పై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఎస్పీ సునీల్ షొరాణే ఆదేశాల మేరకు ఈ రోజు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ప్రత్యక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ-సాక్ష్య పోలీస్ యాప్ అనేది పోలీస్ శాఖలకు అందుబాటులో ఉన్న మొబైల్ యాప్(Mobile app) అని, పోలీసు అధికారులు నేర స్థల పరిశీలన సాక్షాధారాల సేకరణ మొదలగు వాటిని ఫోటోలు, వీడియోల రూపంలో 4 నిమిషాల వరకు రికార్డ్ చేయవచ్చు అన్నారు. సదరు వీడియోలు, ఆడియో సాక్ష్యాలను ప్రత్యక్షంగా సేకరించినవి వెంటనే క్లౌడ్ ఆధారిత సర్వర్‌లలో అప్‌లోడ్ చేయబడతాయన్నారు.
దీనివల్ల సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉండదన్నారు. ప్రతి ఫోటో, వీడియో, ఆడియో ఎక్కడ, ఏ సమయంలో తీశారో తెలిపే జీపీఎస్ లొకేషన్, టైమ్ స్టాంప్ ఆటోమెటిక్(automatic)గా రికార్డ్ అవుతుందన్నారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత నిబంధనలకు అనుగుణంగా డిజిటల్ ఆధారాలను సురక్షితంగా నిల్వ చేస్తుందన్నారు . దీని వలన పోలీసులు సేకరించిన సాక్షాధారాలు మార్పులు చేయకుండా క్లౌడ్‌లో నిల్వ చేయబడతాయన్నారు.
ఈవిధంగా చేయడం ద్వారా కేసుల విచారణల్లో సమయం తగ్గుతుందన్నారు. అలాగే నేరం చేసిన వారికి తప్పనిసరిగా శిక్ష విధించబడడం జరుగుతుందన్నారు. ఈ విధానం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్‌తో పాటు డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మురళీధర్ రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్ ధనమ్మ పాల్గొన్నారు.
