DRONES | ఆధునాతన పద్ధతులతో సాగు.. బ‌హుబాగు

  • రైతు సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

DRONES | కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : వరి సాగులో అధునాతన పద్ధతులను అవలంబించడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం చల్లపల్లి మండలం మేకావారిపాలెంలో రైతు సంఘాలకు డ్రోన్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీతో అందించే డ్రోన్లు స్వీకరించిన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం విశేష ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేపట్టిన 48 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో రైతులకు నగదు జమ చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కొనియాడారు. అన్నదాత సుఖీభవ వంటి పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు వివరించారు. మొందా తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడూరు మండలానికి విచ్చేసి పరిశీలించారని, రైతులకు అండగా నిలబడేందుకు భరోసా కల్పించాలని తెలిపారు. ఇటీవల కాలంలో డ్రోన్ల ద్వారా మందుల పిచికారి అధికంగా జరుగుతోందని, డ్రోన్లను వినియోగించుకుని రైతు సంఘాలు ఆర్థిక బలోపేతం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply