దళారులను నమ్మవద్దు..
సంగారెడ్డి ప్రతినిధి, రాయికోడ్, (ఆంధ్రప్రభ):
పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని సీసీఐ అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కోరారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేలసంగంలోని కాటన్ మిల్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను కల్పించాలని సీసీఐ అధికారులను మంత్రి కోరారు. దళారులను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా సదాశివ పేట, రాయికోడ్, నారాయణఖేడ్, జోగిపేట, వట్పల్లి మండలాల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. పత్తి రైతులు కనీస మద్దతు ధర కోసం ‘కపాస్ కిసాన్ ‘మొబైల్ యాప్ ను డౌన్ లోన్ చేసుకోవాలని సీసీఐ అధికారులు ఈ సందర్భంగా కోరారు. గత వర్షాకాలం (2024-25)లో 3 లక్షల 80 వేల క్వింటాల్ల పత్తిని కోనుగోలు చేసి రైతులకు రూ.280 కోట్లు చెల్లించామని సీసీఐ అధికారులు మంత్రి దామోర్ రాజనర్సింహకు వివరించారు. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ వరుణ్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
పెద్ద చెల్మెడలో సోయాబిన్ కొనుగోలు కేంద్రం షురూ..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మార్కెఫెడ్ ఆధ్వర్యంలో సోయాబిన్ రైతు సోదరులకు వ్యవసాయ శాఖ నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.5328ను కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో సోయాబిన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నామన్నారు.
చిన్నారులతో ముచ్చటించిన మంత్రి..
అనంతరం సోయాబిన్ కొనుగోలు కేంద్రం పక్కన ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరీశిలించారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు బిస్కెట్లు, మిఠాయి పంచారు. అంగన్ వాడీ టీచర్‌ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ వినయ్, పెద్ద చెల్మెడ పీఏసీఎస్ కార్యదర్శి శివరెడ్డి, సీనియర్ నేతలు రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సతీష్, మాజీ జడ్పీటీసీ అసద్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

