తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్

తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్

ప్లాట్లు కొని మోసపోవద్దు.. కమిషనర్ హెచ్చరిక

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నగర పరిధిలో అనధికార లేఅవుట్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ శనివారం సూచించారు. లక్ష్మిపురం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 696 (పి)లో ‘తిరుమల గిరి ఫేస్-6’ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్ పూర్తిగా అనధికారమని స్పష్టం చేశారు.


విడుదల చేసిన ప్రకటనలో కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ… సంబంధిత లేఅవుట్‌కు నగరపాలక సంస్థ లేదా పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఎల్‌ఆర్‌ఎస్-2020 పథకం కింద కూడా యజమానులు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు.
దీంతో ఆ లేఅవుట్‌లో ప్రాథమిక మౌలిక సదుపాయాలైన రహదారులు, డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయం వంటి అంశాలు భవిష్యత్తులోనూ కల్పించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.


మోసపోయే ప్రమాదం


అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన పక్షంలో, కొనుగోలుదారులు అనేక సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూమి రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ, నిర్మాణ అనుమతులు పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే విద్యుత్, నీరు, రోడ్డు వంటి సదుపాయాలు లేకపోవడం వల్ల నివాసానికి అనుకూల పరిస్థితులు ఏర్పడవని నిపుణులు చెబుతున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌లో చేరని లేఅవుట్లు ప్రమాదకరంఎల్‌ఆర్‌ఎస్-2020 పథకం ద్వారా అనధికార లేఅవుట్లను చట్టబద్ధం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ‘తిరుమల గిరి ఫేస్-6’ యజమానులు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కమిషనర్ తెలిపారు. దీంతో భవిష్యత్తులో ఆ లేఅవుట్‌కు చట్టబద్ధ హోదా లభించే అవకాశాలు కూడా తగ్గిపోయినట్లు స్పష్టం చేశారు.


ప్రజలకు సూచనలు


ప్లాట్లు కొనుగోలు చేసే ముందు సంబంధిత భూమి చట్టబద్ధతపై పూర్తిస్థాయిలో ధృవీకరణ చేసుకోవాలని, పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, లేఅవుట్ ఆమోద పత్రాలను పరిశీలించాలని కమిషనర్ సూచించారు.


అనధికార లేఅవుట్లకు ఆకర్షణీయ ధరలు, తక్షణ రిజిస్ట్రేషన్ వంటి ప్రలోభాలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే భారీగా ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
నగరాభివృద్ధి క్రమబద్ధంగా కొనసాగాలంటే చట్టబద్ధమైన లేఅవుట్లలోనే పెట్టుబడులు పెట్టాలని కమిషనర్ పి. విశ్వనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply