Donald Trump H-1B | అమెరికాలో శిక్షణ ఇవ్వడానికే?!
- Donald Trump | స్పష్టం చేసిన అమెరికా….
- Donald Trump | కంగుతిన్న ఆశావహులు!
Donald Trump | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికాలో రెండోసారి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మొదటి నుంచి అక్రమ వలసదారులు అంటూ హెచ్-1బీ వీసాపై దృష్టి సారించారు. హెచ్-1బీ వీసా(H-1B visa) ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మన దేశంతోపాటు పలు దేశాలు ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
అమెరికాలోని అంతర్గతంగా కూడా దీనిపై చర్చ సాగింది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్(American Chamber of Commerce) అయితే నేరుగా అక్కడ కోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రతినిధులయితే ట్రంప్(Trump)కు లేఖ కూడా రాసి హెచ్-1బీ సరళీకృతం చేయాలని కోరారు. నైపుణ్యం కలిగిన స్వదేశీ ఉద్యోగులు లేని కారణంగా విదేశాల నుంచి నైపుణ్యం తెచ్చుకోవడం దేశానికి అవసరమంటూ రెండు రోజుల కిందట ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
దీంతో హెచ్-1బీ కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆశలు 24 గంటలు కూడా నిలవలేదు. ట్రంప్ మాటలకు అర్థాలు వేరులే అన్నట్లు అమెరికా ఆర్థిక శాఖామంత్రి స్కాట్ బెసెంట్(Scott Besant) వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవచ్చు.
స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ట్రంప్ కొత్త హెచ్-1బీ వీసా విధానం నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికాకు రప్పించి, అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి తీసుకు రావడానికి రూపొందించినట్లు వెల్లడించారు. ఇక్కడ యువతకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే హెచ్-1బీ ఇస్తున్నామని, విదేశీయులతో ఇక్కడ పోస్టులు భర్తీ (Vacancies)చేసేందుకు కాదని స్పష్టం చేశారు.
‘అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోండి. ఆ తర్వాత అమెరికన్లే పూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు’ అనేదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం’ అని వెల్లడించారు. విదేశీ కార్మికుల(Foreign Workers)పై దీర్ఘ కాలంగా ఆధార పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. అందుకోసం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు తీసుకురావడమే ఈ కొత్త విధానం అని బెసెంట్ అన్నారు.
హోం లాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టి నోయమ్(Kristi Noem) మాట్లాడుతూ “అమెరికాకు వచ్చే వ్యక్తులు ఉగ్రవాదులకు, అమెరికాను ద్వేషించే సంస్థలకు మద్దతుదారులు కాదని నిర్ధరించుకుంటాం. అందుకోసం వెట్టింగ్ ను కొనసాగిస్తాం మా ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాల ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోంది. దాంతోపాటు అమెరికాకు వచ్చి ఉంటున్న వ్యక్తులు సరైన కారణాల వల్ల ఇక్కడ ఉన్నారని మేం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటున్నాం” అని వెల్లడించారు.
హెచ్-1బీ కేవలం ఆ దేశంలోని నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికే అని అమెరికా ప్రకటించడంతో మంత్రి స్కాబ్ బెసేంట్ వ్యాఖ్యలో హెచ్-1బీపై ఆశలు పెంచుకున్నవారు కంగుతిన్నారు.

