గంట్యాడ(విజయనగరం), ఆంధ్ర ప్రభ : గురువుగా అవతారమెత్తిన జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి.. అంతలోనే విద్యార్థుల్లో ఒకరిగా మారిపోయారు. జిల్లాలోని గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ తొలుత విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. ఆ పైన మధ్యాహ్న భోజన పథకం పరిశీలనలో భాగంగా విద్యార్థులకు వడ్డన చేసి, అదే విద్యార్థుల వరుసలో నిల్చుని కంచం పట్టి భోజనం వేయించుకున్నారు. భోజనం తింటూనే విద్యార్థులతో మాట్లాడి ప్రతిరోజూ వంటకాలు, మెనూ స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. తమతో పాటు జిల్లా సర్వోన్నతాధికారి కలిసి భోంచేయడం పట్ల విద్యార్థులు ఎంతగానో ఆనందించారు.




