10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నుల పంపిణీ

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు మడికొండ సంపత్ కుమార్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని విద్యాలయ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలను పురస్కరించుకొని గురువారం రోజు తమ తల్లిదండ్రులు క్రీ.శే. మడికొండ సారమ్మ–పోచయ్య జ్ఞాపకార్థం పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు.

కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి..
ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, స్వంత ఊరుకు మరియు దేశానికి సేవ చేసే ప్రతిభావంతులుగా ఎదగాలని సూచించారు. విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గౌరవింపబడతాడని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి నాయకత్వ స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

పదవ తరగతి విద్యార్థులకు కీలక దశ..
ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మడికొండ సంపత్ కుమార్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ఇది ఎంతో కీలకమైన దశ అని అన్నారు. ఈ సమయంలో సరైన స్టడీ మెటీరియల్ మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం చాలా అవసరమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మడికొండ బ్రదర్స్‌ను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం సభ్యుడు గోపి సార్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ–విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply