లక్ష 83 వేల చేప పిల్లల పంపిణీ..
నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికరెడ్డి(Dr. Chittem Parnika Reddy) అన్నారు. ఈ రోజు నారాయణపేట పరిధిలోని కొండారెడ్డిపల్లి చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె లక్ష 83 వేల చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన జిల్లాకు మత్స్యశాఖ మంత్రి ఉండటం గర్వకారణమని, జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.
ముదిరాజుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముదిరాజులను బీసీ–డి నుండి బీసీ–ఏ వర్గంలోకి చేర్చే ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈ సారి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం 123 కోట్లతో చేపట్టబడిందని, 82 మిల్లీమీటర్ల సైజులో చేప పిల్లలను వదిలామని తెలిపారు. ఈ సారి 60 పెద్ద ట్యాంకుల్లో 80 లక్షల చేప పిల్లలను వదిలే కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు.
గతంలో చేప పిల్లలు దూర ప్రాంతాల నుంచి తెప్పించేవారని, ప్రస్తుతం వనపర్తి జిల్లా(Wanaparthy District)లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ధన్వాడ రోడ్ శాంక్షన్ అయ్యిందని వెల్లడించారు. ముదిరాజ్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని, 69వ జీ.ఓ. ద్వారా రెండు పెద్ద రిజర్వాయర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు.
ప్రాజెక్టులు త్వరలో పూర్తి అవుతాయని చెప్పారు. సొసైటీ సభ్యులు ఇన్సూరెన్స్(Insurance) చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేష్, మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి(Sadashiva Reddy), వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు కాంత్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఖదీర్ అహ్మద్, జిల్లా అధికారి రెహమాన్, ముదిరాజ్ సంఘ నాయకులు కాకర్ల భీమయ్య, పళ్ళ వెంకట్‌రాములు, లక్ష్మీకాంత్(Sadashiva Reddy), సంజీవ్ ప్రకాశ్, శ్రీకాంత్ సిరి, కాంగ్రెస్ నాయకులు సలీం, సాయిబాబా, మహమ్మద్ ఖురేషి రహమత్ తదితరులు పాల్గొన్నారు.