Distribution | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

Distribution | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
- పల్లంపల్లిలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
- 45 మంది రైతులకు అందజేసిన ఎమ్మెల్యే సౌమ్య
Distribution | (వీరులపాడు ఆంధ్రప్రభ) : వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామంలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి–మీ హక్కు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పల్లంపల్లి రెవెన్యూ పరిధిలోని 45 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అధికారులు, కూటమి నేతలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం “మీ భూమి–మీ హక్కు కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం అందించడంతో పాటు, రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పట్టాదారు పాసు పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పాసు పుస్తకాల వల్ల రైతులకు బ్యాంకు రుణాలు, వ్యవసాయ పెట్టుబడులు సులభంగా లభిస్తాయని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న రైతులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి కృతజ్ఞతలు తెలిపారు.

