Dispute | మాకు ఈ ఏకగ్రీవం వద్దు…
- విశ్వనాధపురం గ్రామంలో ఏకగ్రీవంపై గ్రామస్తుల ఆగ్రహం
- రూ.25లక్షల ప్యాకేజీ ఆరోపణలు..
- దండోరా వేస్తూ మరో విడత ఎన్నికల డిమాండ్
Dispute | గీసుగొండ, ఆంధ్రప్రభ : గీసుగొండ మండలంలోని విశ్వనాధపురం గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవంపై పెద్ద ఎత్తున వివాదం రేగింది. బడా నాయకులు తమ స్వలాభం కోసం రూ.25లక్షల ప్యాకేజీ మాట్లాడుకొని వారికి నచ్చిన అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ పెద్దల అనుమతి లేకుండా కొందరు బడా నాయకులు రూ.25లక్షల ప్యాకేజీ డీల్ (Deal) చేసి తమకిష్టమైన అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే (వర్గం నుండి పోటీకి దిగిన అభ్యర్థిని సర్పంచ్ పదవికి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి దిగిన సర్పంచ్ అభ్యర్థిని ఉప సర్పంచ్ ఇచ్చేందుకు డీల్ చేసుకున్నట్లు వినికిడి. కాంగ్రెస్ కు చెందిన రేవూరి వర్గ నేతలు, బీఆర్ఎస్ కు చెందిన నాయకులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం. మరో విడత ఎన్నికలు ఏర్పాటు చేయాలని గ్రామంలో దండోరతో వాడవాడ తిరుగుతూ “మాకు ఈ ఏకగ్రీవం వద్దు… వెంటనే మరో ఎన్నికలు జరగాలి” అని బహిరంగ నిరసన వ్యక్తం చేశారు.
బడా నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడానికి గ్రామస్తుల తీర్మానం లేకుండానే తమ స్వలాభం కోసం రూ.25 లక్షల ప్యాకేజీ తీసుకొని అభ్యర్థులతో పాటు వాటాలు వేసుకున్నట్లుగా గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం అసలు ఉన్నట్లా.. లేనట్లా అని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఈ అంశంపై స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇదిలా ఉండగా, సర్పంచ్ ఏకగ్రీవం తర్వాత వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేయాలని కొందరు నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు వినికిడి. గ్రామంలోని 9 వార్డుల్లో పోటీ కొనసాగుతున్నప్పటికీ, “సర్పంచ్ ఏకగ్రీవమైందని మేము పోటీ నుంచి తప్పుకోవడం కుదరదు” అని ఓ వార్డు మెంబర్ అభ్యర్థి స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో విశ్వనాధపురం (Vishwanathpuram) గ్రామం ప్రస్తుతం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

