గురువును మరువని శిష్యుడు : మంత్రి తుమ్మల

దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జీవితంలో ఎన్నడూ మరువలేని మధుర ఘట్టం శనివారం దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో చోటుచేసుకుంది. చిన్నతనంలో తనను భుజాలపై మోసి, వ్యవసాయంపై మక్కువ కలిగించిన తన ‘గురువు’, ‘అత్త’ అయిన అచ్చెమ్మను మంత్రి ఆత్మీయంగా కలుసుకుని హత్తుకున్నారు.
బాల్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అచ్చెమ్మ అత్త వెంట పొలాలకు వెళ్లేవారు. అప్పట్లో ఆమె వరి, పొగాకు వంటి పంటల సాగులో చూపిన మెళకువలు, చెప్పిన వ్యవసాయ అనుభవాలు తనలో వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంచాయని మంత్రి గుర్తుచేసుకున్నారు. “ఆనాడు అచ్చెమ్మ అత్త వేసిన బీజమే నేడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది” అని ఈ సందర్భంగా భావోద్వేగంతో తెలిపారు.
“నిన్ను చూడాలనిపించి వచ్చా బాబు”
అచ్చెమ్మను చూసిన వెంటనే మంత్రి తుమ్మల, “ఏం అచ్చెమ్మ అత్త బాగున్నావా? ఏదైనా పని ఉండి వచ్చావా?” అని అడిగారు. దీనికి ఆమె, “ఏం లేదు బాబు… నిన్ను చూసి చాలా కాలమైంది. ఒక్కసారి నిన్ను చూడాలనిపించి వచ్చాను” అని చెప్పడంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది. అనంతరం ఇద్దరూ కాసేపు బాల్యస్మృతులను గుర్తుచేసుకున్నారు.
వర్షంలో అత్తపై ప్రత్యేక శ్రద్ధ
ఆ సమయంలో వర్షం కురుస్తుండటంతో అచ్చెమ్మ ఆరోగ్యంపై మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆమె వెంట వచ్చిన మనవడిని పిలిచి, “ముసలమ్మను జాగ్రత్తగా చూసుకో… వర్షం పడుతోంది కదా, బండి నిదానంగా నడుపు” అని సూచించారు.
ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా తనను పెంచి పెద్ద చేసిన సామాన్య మహిళను గుర్తించి గౌరవించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన మూలాలను మరువని వ్యక్తిత్వం ఆయనదని గ్రామస్థులు కొనియాడారు.
