Digital | పంట భూములన్నీ మ్యాపింగ్​! తెలంగాణలో డిజిటల్​ సర్వే

డ్రోన్లతో సర్వేకు అంతా సిద్దం
ఇక మీదట పక్కాగా భూముల లెక్క
నేటి నుంచి అయిదు జిల్లాల్లో పైలట్​ ప్రాజెక్టు అమలు
ములుగు, జగిత్యాల, సంగారెడ్డి, మహబుబ్​నగర్​, ఖమ్మంలో భూ సర్వే
అమల్లోకి వచ్చిన భూ భారతి చట్టం
భూ వివరాలతో కొత్త పాస్​ పుస్తకాల జారీ
ప్రయోగాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
పైలట్​ ప్రాజెక్టులో అయిదు జిల్లాల ఎంపిక
రైతులవారీగా, విస్తీర్ణానికి తగ్గట్టు హద్దుల నిర్ణయం

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ : భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. భూ సర్వే చేపట్టి పంట భూములను మ్యాపింగ్​ చేయనుంది. ప్రయోగాత్మకంగా జగిత్యాల, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, ములుగు జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో జిల్లాలోని ఒక్కో గ్రామంలో పూర్తి స్థాయి సర్వే చేసి, రైతుల భూ వివరాలను మ్యాపులతో సహా రెడీ చేసి కొత్త పాసుపుస్తకాలు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.


ఎస్సారెస్పీ పునరావాస గ్రామమైన కోమన్‌పల్లి.. సారంగాపూర్‌ మండలం తుంగూరు, కొల్వాయి, ధర్మపురి మండలంలోని ఆరెపల్లి, దొంతాపూర్, తీగల ధర్మారం రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉంటుంది. కోమన్‌పల్లి, అన్నారం, డొంకేశ్వర్, నెదునూరు, వచ్చునూరులను అయిదు రెవెన్యూ గ్రామాలుగా విభజించి, మొత్తం 626.08 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లుగా గుర్తించారు. సారంగాపూర్‌ మండలం కొల్వాయి రెవెన్యూ పరిధిలో 512.00, ధర్మపురి మండలం దొంతాపూర్‌ రెవెన్యూ పరిధిలో 114.08 ఎకరాలు ఉన్నట్లుగా తేల్చారు. సర్వే విషయమై ఈరోజు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.

డిజిటల్​ సర్వే..

మొదట డ్రోన్‌ సర్వేతో గ్రామ పటాన్ని (మ్యాప్​) రూపొందిస్తారు. తర్వాత సర్వే నెంబర్ల వారీగా డిజిటల్‌ సర్వే చేస్తారు. అనంతరం రైతుల వారీగా అనుభవ సర్వే చేప‌డ‌తారు. ఇక‌.. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ రికార్డ్స్​ ప్రకారం రైతుల‌ వారీగా విస్తీర్ణానికి తగ్గట్లు హద్దులను నిర్ణయిస్తారు. అక్షాంశ, రేఖాంశాల వారీగా జియో కోఆర్డినేట్‌ చేస్తారు. ఈ నెల 25వ తేదీన డ్రోన్‌ సర్వే ఉంటుంది. 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సర్వే నెంబర్ల వారీగా హద్దులను నిర్ణయిస్తారు. జూన్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ లోగా డిజిటల్‌ సర్వే నిర్వహించి రైతుల వారీగా హద్దులు నిర్ణయిస్తారు. జూన్‌ 7, 8 తేదీల్లో రైతుల వారీగా పటాలను తనిఖీ చేసి, 12వ తేదీన సమగ్ర వివరాలతో పూర్తిస్థాయి జాబితాను రూపొందిస్తారు.

పకడ్బందీగా అమలు చేస్తాం..

జ‌గిత్యాల జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కోమన్‌పల్లిలో పక్కాగా భూ సర్వేను చేపడతామని కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ అన్నారు. సర్వే కోసం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, నలుగురు సర్వేయర్లను కేటాయించామని వివరించారు. మొదట గ్రామంలో అవగాహన కల్పించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. డ్రోన్‌ ద్వారా గ్రామపటం రూపొందించి, తర్వాత డిజిటల్‌ పద్ధతిలో సర్వే నంబర్ల వారీగా రైతుల వారీగా హద్దులను నిర్ణయిస్తామని వివరించారు. భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు రాకుండా ఉండేందుకు సర్కారు చేపట్టిన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.

Leave a Reply