Dharna | రాజ‌కీయ క‌క్ష‌తోనే కెసిఆర్ కు నోటీసులు … ఎమ్మెల్సీ క‌విత

హైద‌రాబాద్ – రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత . తెలంగాణకు నీళ్లు, నిధులు తీసుకురావటం కేసీఆర్ చేసిన తప్పా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజులు కాదని.. 21పంపు హౌస్‌లు, కాళేశ్వరంతో 35శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని అన్నారు.

కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులకు వ్యతిరేకంగా ఇందిరాపార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ధర్నా కొన‌సాగింది. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ, నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు.. రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని సహించబోమని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన‌ గురువు చంద్రబాబు ఏపీకి గోదావరి జలాలను తరలించుకుపోతుంటే.. మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదా అని నిలదీశారు.

వెంటనే రేవంత్‌రెడ్డి.. ‌అపెక్స్ కౌన్సిల్, కేంద్రానికి‌ లేఖ రాయాలని కోరారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు‌లు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన‌ మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని కోరారు. 21కి గానూ.. 20 పంపు హౌస్‌లు మెగా కృష్ణారెడ్డి కట్టారని గుర్తుచేశారు. మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఆయనను విచారణకు ఎందుకు పిలవటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు కవిత.

ఏపీ సీఎం చంద్రబాబు మీద ఆధారపడి బీజేపీ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోందని కవిత ఆరోపించారు. అందుకే కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి‌ సంజయ్ బనకచర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ అయినా ఈ విషయంపై మాట్లాడాలని కోరారు. రైతులు, జాగృతి తరుపున మాట్లాడాలని ఈటలకు విజ్ఞప్తి చేశారు. నోరు కట్టేసుకుని అపవాదు తెచ్చుకోవద్దని ఈటలను కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈటల రాజేందర్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కోరారు.

గోదావరిలో వెయ్యి టీఎంసీల‌‌ నీళ్లు వచ్చేవరకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ప్రకటించారు. దీంతో హైదరాబాద్‌కు శ్వాశతంగా నీటి అవసరాలు తీరుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. కేసీఆర్‌ది గట్టి గుండె కాబట్టే.. కాళేశ్వరం కట్టారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కలలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల పేరుతో.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16టీఎంసీలు మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. కేసీఆర్ 141 టీఎంసీలు తెలంగాణకు నిల్వ ఉండాలని కాళేశ్వరం కట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని విమర్శించారు.

Leave a Reply