Devotees | సౌకర్యాలు అందక…
Devotees | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన పెనుగంచిప్రోలులోని (Penuganchiprol) శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు కనీస సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ఉద్యోగుల పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుందామని ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు నిరాశే మిగులుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలపై నిర్వహించిన సమీక్షలోనూ పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులకు (devotees) అందించే సేవల్లో చివరి స్థానంలో ఉంది. దీంతో ఆలయ అధికారి కిషోర్ కుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. అధికారులున్నా.. రెండు, మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారు. ఒకరిద్దరు ఉద్యోగులు చెప్పిన మాటలతోనే అధికారులు విధులు నిర్వహిస్తున్నారని, దీంతో దిగువ స్థాయిలో ఉద్యోగులు భక్తులకు సేవలందించడంపై దృష్టి సారించట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేలల్లో భక్తులు రాక..
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి శుక్ర, ఆదివారాలు అమ్మవారి ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గతంలో ఆర్జేసీ స్థాయిలో ఉండే ఆలయ స్థాయిని తగ్గించి ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) అధికారి స్థాయికి తగ్గించారు. అమ్మవారికి మొక్కుబడులు సమర్పించి పూజలు చేసుకునే క్రమంలో ఆలయం వద్ద, సత్రాలు, మునేరు అవతలి వైపు ఉన్న ప్రైవేట్ మామిడి తోటల్లో భక్తులు విడిది చేస్తుంటారు.
వీరికి రక్షణ కరవైంది. కనీస భద్రత లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.ఆలయం వద్ద పలు దుకాణాలకు పాటలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ భక్తులను దోపిడీ చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులపై స్థానికులు దాడులు చేస్తే.. అధికారులు, పోలీసు స్టేషన్లలో (Police station) ఫిర్యాదుల చేసినా ఫలితం ఉండట్లేదు. స్థానికులకు రాజకీయ అండదండలు ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు.
చివరికి భక్తులే అవమానాలతో, గాయాలతో సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఆలయం వద్ద హోంగార్డులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా పోలీస్ (Police) అవుట్ పోస్టు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సౌకర్యాల కల్పనతో పాటు భద్రతకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

