గంట రవి జన్మదినోత్సవం అభివృద్ధి పనులకు శ్రీకారం

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; పుట్టినరోజు వేడుకలు పెళ్లిరోజు వేడుకలలో ఖర్చులు మాని సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలనీ బిజెపి జిల్లా అధ్యక్షుడుగంట రవికుమార్ వినూత్న సేవా కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం సత్యం గ్రూప్స్ ఫౌండర్, వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంట రవికుమార్ 45వ జన్మదినోత్సవం వినూత్నంగా నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా పుట్టినరోజుల సందర్భంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్‌లు, క్రాకర్స్ వంటి వ్యర్థ ఖర్చులకు దూరంగా ఉంటూ, శివనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
పాఠశాలలో విద్యార్థులకు సరైన మూత్రశాలల సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించిన ఆయన, కొత్తగా మూత్రశాలల నిర్మాణాన్ని ప్రారంభించారు. పాఠశాల భవనంలో ఫ్లోరింగ్ పనులను కూడా చేపట్టి, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ,పుట్టినరోజులు, పెళ్లి వార్షికోత్సవాల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేయడం వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు.
అదే డబ్బుతో చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తే సమాజానికి మేలు జరుగుతుంది అని అన్నారు. ఆయన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నరేందర్ స్వామి , ఉపాధ్యాయులుగంట రవికుమార్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
