మ‌హ‌నీయుల స్ఫూర్తితో అభివృద్ధి : రేవంత్​

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : స్యాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. భారత ప్రజలకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ (79th Independence Day) శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచ నగరాలతో పోటీ పడే నిర్ణయాలతో తెలంగాణ(Telangana)ను ముందుకు తీసుకువెళుతున్నామని అన్నారు. అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామన్న సీఎం, స్వాతంత్య్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15న మాజీ ప్రధాని నెహ్రూ(Former Prime Minister Nehru) చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందని, దేశ భవిష్యత్ మనల్ని పిలుస్తోందని నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయం అని గుర్తు చేశారు. మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని, ఆనాడు పెద్దలు వేసిన పునాదులతోనే నేడు దేశం సుసంపన్నంగా ఉందని ఆకాంక్షించారు.

సాహసోపేత నిర్ణ‌యాల‌తో..
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) సాహసోపేత నిర్ణయాలతో సాగుతోందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. మరోవైపు పేదల సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తున్నామని, సంక్షేమానికి కేరాఫ్‌ అంటే కాంగ్రెస్‌ పాలన అని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని, సన్నబియ్యం పథకం కేవలం ఆకలితీర్చే పథకం కాదని పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని రేవంత్​ రెడ్డి చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చాకే పేదల సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న సీఎం రేషన్‌ షాపులు (Ration Shops) పేదవాడి ఆకలి తీర్చే భరోసా కేంద్రాలుగా మారాయని తెలిపారు.

రైతులకు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాం..
గతేడాది ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ (Loan Waiver)కి శ్రీకారం చుట్టామని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని సగర్వంగా నిలబడ్డామని సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy)అన్నారు. విత్తనాలు వేసేనాటికే రైతుల ఖాతాల్లో రైతుభరోసా ఇచ్చామని, పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు వేశామని తెలిపారు. రైతు పండించిన చివరిగింజ వరకు ధాన్యం సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 78 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్న సీఎం ప్రభుత్వం అండగా నిలవడంతో రైతులు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపారని తెలిపారు.

కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా :
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) నుంచి చుక్కనీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించామని సగర్వంగా చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌, కోయిల్‌సాగర్‌తో వరి పండిస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరుస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్లపాటు వారికి సొంతింటి కలను దూరం చేసిందని సీఎం రేవంత్​ రెడ్డి దుయ్యబట్టారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తులు లేకుండా పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అన్నారు.

బీసీ బిల్లులు ఆమోదించండి…
సామాజిక న్యాయం కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని, సామాజిక కుల, ఆర్థిక, రాజకీయ, విద్య సర్వేను ఒక యజ్ఞంలా చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సామాజిక సర్వే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేశామని, మార్చి 2న బిల్లులు తెచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులను త్వరగా ఆమోదించాలని గోల్కొండ కోటపై నుంచి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

బెదిరింపుల‌కు లొంగేది లేదు
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న రేవంత్​ రెడ్డి, మన వాటా సాధించే వరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని అన్నారు. మన భూములు సస్యశ్యామలం అయ్యాకే మరొకరి నీళ్ల గురించి ఆలోచిస్తామని, నెహ్రూ నిర్మించిన సాగర్‌, శ్రీశైలం, శ్రీరామ్‌సాగర్‌తోనే మనకు నీళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లను గోదావరిలో పోసిందని దుయ్యబట్టారు. రూ.లక్ష కోట్లు వృథా చేసి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా జలాల్లో మన వాటాను వదులుకోవటం అనేది జరగదని తేల్చి చెప్పారు.

Leave a Reply