ఉగాది సందడి.. అభివృద్ధి దిశగా కర్నూలు ముందడుగు

ఉగాది సందడి.. అభివృద్ధి దిశగా కర్నూలు ముందడుగు
కొత్త సంవత్సరం కొత్త ఆశలు… జిల్లాకు భారీ ప్రాజెక్టుల హామీ
ఉగాది వేడుకల్లో అభివృద్ధి శుభసూచనలు
పరాభవ నామ సంవత్సరంలో ప్రగతి పథంలో కర్నూలు
ఆత్మవిశ్వాసమే ఆయుధం… కొత్త ఏడాదికి మంత్రి, కలెక్టర్ పిలుపు
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ శుభాలను తీసుకురావాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ ఆకాంక్షించారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గడిచిన సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడిచిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ఇదే విధంగా కొత్త సంవత్సరంలో కూడా అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు దేశంపై పరోక్ష ప్రభావం చూపే అవకాశమున్నప్పటికీ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా అభివృద్ధి దిశగా పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఓర్వకల్లులో రిలయన్స్, అగస్త్య వంటి ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయని, సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఐఎస్ఎమ్ 2.0 విధానం అమలులోకి వచ్చిన తరువాత సుమారు రూ.24 వేల కోట్ల ప్రాజెక్ట్ తదుపరి దశకు చేరుకుంటుందని పేర్కొన్నారు. మొత్తం మీద రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులు అమలయ్యే అవకాశం ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రహదారులు, కాలువలు, నదుల సంరక్షణ వంటి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని వివరించారు.

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ… ఉగాది అంటే కొత్త యుగానికి ఆరంభమని పేర్కొన్నారు. జీవితంలో వచ్చే సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుందని చెప్పారు. గతాన్ని మరిచి కొత్త ఆశలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సంప్రదాయ పంచకట్టుతో కార్యక్రమానికి హాజరై ఆకట్టుకున్నారు. బీహార్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య భౌగోళిక, సాంస్కృతిక భిన్నతలను వివరించారు. ఇక్కడి పండుగలు, ఆహారం తనకు ఎంతో నచ్చాయని తెలిపారు.

వేద పండితులు, అర్చకులకు సన్మానం ఉగాది సందర్భంగా వేద పండితుడు కృష్ణమూర్తి, అర్చకులు గిరి మల్లయ్య, చెన్నకేశవ, బిచ్చు పుల్లయ్యలను శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు, ఒక్కొక్కరికి రూ.10,116 నగదు బహుమతిగా అందజేశారు.

అదేవిధంగా కవి సమ్మేళనంలో పాల్గొన్న పలువురు కవులను మంత్రి, కలెక్టర్ సన్మానించారు. ప్రభుత్వ సంగీత పాఠశాల విద్యార్థులు, గిరిజన పాఠశాల విద్యార్థుల నృత్య, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ సి. వెంకటనారాయణమ్మ, వివిధ శాఖల అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
