DEO| క్రిష్ణగిరిలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు

DEO| క్రిష్ణగిరిలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు
DEO| కర్నూలు, ఆంధ్రప్రభ : క్రిష్ణగిరి మండలంలోని పలు విద్యా సంస్థల్లో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ (S. Samuel Paul) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఏపీ మోడల్ స్కూల్, ఎమ్మార్సీ కేంద్రం, కేజీబీవీ, ఎరుకలచెరువు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధన విధానాలు, నిర్వహణ అంశాలను పరిశీలించారు. మోడల్ స్కూల్‌లో ఉదయం ప్రార్థనలో పాల్గొన్న డీఈఓ, అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సిలబస్ పూర్తి స్థితి, పాఠ్యాంశాల బోధన ప్రణాళిక, గణితం, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రగతి గురించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు క్లిష్టంగా భావిస్తున్న అంశాలు ఏవో తెలుసుకుని, ఉపాధ్యాయులు సాంకేతిక పద్ధతులను వినియోగించి పాఠాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని సూచించారు. డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చే వందరోజుల కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎమ్మార్సీ కేంద్రంలో రికార్డులు, హాజరు వివరాలను పరిశీలించిన డీఈఓ, ఈ నెలలో మండల ఎంఈఓ–1 సునంద హాజరు నమోదు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వెంటనే ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వివరాలు సేకరించాలని సిబ్బందికి ఆదేశించారు. మండల పరిశీలనలో లోపాలు తేటతెల్లమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీ (KGBV) సందర్శన సందర్భంగా ఆరో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠం చెప్పారు. పదో తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ బోధించి ప్రశ్నల రూపంలో అవగాహనను పరీక్షించారు. పీహెచ్ విలువ వంటి అంశాలపై విద్యార్థుల అర్థం చేసుకున్న స్థాయిని పరిశీలించారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని కృష్ణవేణికి విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన పద్ధతులపై సూచనలు చేశారు. కిచెన్‌ను పరిశీలించి ఆహార నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎరుకలచెరువు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులతో కలిసి చేసి నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో పదో తరగతి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం పాఠ్యాంశాల బోధన స్థితిని తెలుసుకుని, ప్రజా పరీక్షలకు సిద్ధం కావాల్సిన విధానంపై సూచనలు చేశారు. ఇంగ్లీష్ వ్యాకరణాంశాలను బోధించి, పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాల లక్ష్యంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
