Delhi | జాతీయజెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

Delhi | జాతీయజెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

Delhi | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణిమ్‌ భారత్, విరాసత్‌ ఔర్‌ వికాస్‌ అనే ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్‌ రాకెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శిస్తున్నారు.

అంతకుముందు గణతంత్ర దినోత్సవం వేళ దేశం కోసం పోరాడిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. తొలుత ఢిల్లీలోని వార్ మెమోరియల్ వద్దకు వెళ్లిన ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికారు. తర్వాత వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ పుష్పాంజలి సమర్పించారు. దేశం కోసం పోరాడిన వీరులకు, త్రివిధ దళాల అధిపతులతో కలిసి వందనం చేశారు. తర్వాత అక్కడి పుస్తకంలో తన సందేశం రాశారు.

Leave a Reply