Defeated Candidates | అయ్యయ్యో చేతులో డబ్బులు పోయేనే

Defeated Candidates | అయ్యయ్యో చేతులో డబ్బులు పోయేనే
- ఇజ్జత్ కా సవాల్ గా సర్పంచ్ ఎన్నికలు
- పోటీ పడి ఖర్చు పెట్టిన అభ్యర్థులు
Defeated Candidates | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : అయ్యయ్యో చేతులో డబ్బులు పోయేనే… ఉన్నది కాస్త ఊడింది… అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు లభో దిభో మంటున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి సర్పంచ్ ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి. నెలకు రూ 6 వేయిలు జీతం వచ్చే సర్పంచ్ పదవి కోసం ఓటర్లకు లక్షలు కుమ్మరించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ముగిసే వరకు గ్రామాల్లోకి ఎన్నికల జాతర కనిపించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు తీసిపోని విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి అంటే అతిశయోక్తి కాదు. మండలంలోని కొన్ని గ్రామాల్లో ఎన్నికలు ఉన్నన్ని రోజులు టెంట్లు వేసి మరి భోజనాలు ఏర్పాటు చేశారు అభ్యర్థులు. రాత్రి అయితే ఓటర్ల ను మందులు, విందులతో ముంచేత్తారు అభ్యర్థులు.
ఇజ్జత్ కా సవాల్ గా ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో నిలిచిన అభ్యర్థులు ఇజ్జత్ కా సవాల్ గా ఎన్నికలను తీసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థులు కొందరు ఓటర్ల ను అకర్శించేందుకు లక్షలు కుమ్మరించారు. ఒక్కో ఓటుకు సరాసరిగా రెండు నుండి నాలుగు వేయిల వరకు ఖర్చు చేశారనేది బహిరంగ రహస్యం. పోటీలో ఉన్న ప్రత్యర్థి అభ్యర్థి చేస్తున్న వ్యయం చూసి ఆపొసిట్ లో ఉన్న అభ్యర్థులు ఇజ్జత్ కా సవాల్ అంటూ అప్పులు చేసి మరి ఖర్చు చేశారు. పొలాలు, బంగారం తాకట్టు పెట్టి మరి అప్పులు తెచ్చారు. కొందరు సన్నిహితులు, స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు తెచ్చి మరి ఓటర్ల ను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నం చేశారు.

సుక్క… ముక్క
కొన్ని గ్రామాల్లో ఓటింగ్ కంటే రెండు రోజుల ముందు ఇంటింటికి మందు బాటిల్, చికెన్ తో పాటు గోధుమ పిండి పంపిణీ చేసినట్టు సమాచారం. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి సంఘాల వారిగా డబ్బులు అందజేసి గంప గుత్త గా ఓట్లు వేయాలని కోరినట్టు సమాచారం. ఇదిలా ఉండగా సర్పంచ్ అభ్యర్థుల తో పాటు వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు సైతం తామేమి తక్కువ కాదన్నట్టు ఓటుకు వెయ్యి నుండి రెండు వేయిలు వ్యయం చేయడం ఈ ఎన్నికల్లో కోసమేరుపు.
పోటా పోటీగా ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలను అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోటా పోటీగా గా తీసుకున్నాయ్. వారి వారి అభ్యర్థులను గెలిపించుకునేందుకు వారి అనుచరులను రంగంలోకి దింపడంతో పాటు ఆర్థికంగా సహాయం అందించారు. ఎలాగైనా తమ పార్టీల మద్దతుతో నిలిచిన అభ్యర్థులను గెలిపించుకుని ఉనికి నిలుపుకోవాలనే ప్రయత్నం కనిపించడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రధాన పార్టీలతో పాటు రంగంలో నిలిచిన అభ్యర్థులు సైతం పోటీ పడి మరి ఖర్చు చేయడం కనిపించింది. తగ్గేదేలే లే అన్నట్టు పోటీ పడ్డారు ఎన్నికల్లో..
గొప్పలకు పొతే అప్పులే మిగిలాయి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది సాధించేది ఏమి లేకున్నా కేవలం పరపతి కొరకు ఎన్నికల్లో నిలుచుకున్న కొందరు అభ్యర్థులకు ఈ ఎన్నికలు లక్షల్లో అప్పుల్లో ముంచాయి. గత బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లుగా పదవులు అనుభవించిన కొందరు వారు చేసిన అప్పుల్లో నుండి బయపడడం లేదు. కద్దరు వెనుక ఉన్న బాధను బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. తాజా ఎన్నికల్లో సర్పంచ్, వార్డ్ మెంబెర్ స్థానాలకు పోటీలో నిలిచిన అభ్యర్థులు సైతం గొప్పలకు పోయి లక్షల్లో అప్పులు చేసుకున్నారనేది స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా అయ్యయ్యో చేతులో డబ్బులు పోయేనే అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు సర్దుకునే పరిస్థితి నెలకొంది.
