Cyber crimes | సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు…
Cyber crimes | కొడకండ్ల, ఆంధ్రప్రభ : రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల(Cyber crimes) పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు పాటించాలని జనగాం డిప్యూటీ కమిషనర్ రాజమహేందర్ నాయక్ అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జనగాం డిప్యూటీ కమిషనర్ రాజమహేందర్ నాయక్ మాట్లాడుతూ.. మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు కొందరు నేరస్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని జనగాం డీసీపీ రాజ మహేందర్ నాయక్(DCP Raja Mahender Naik) అన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని, బహుమతుల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ లకు దూరంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ఆకర్షితులై ఎలాంటి లింకులను ఓపెన్ చేయకూడదని డిసిపి రాజ మహేందర్ నాయక్ సూచించారు. విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిసిపి సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నంబర్(1930 trollfree number)కు డయల్ చేయాలన్నారు.

అనంతరం వర్ధన్నపేట అసిస్టెంట్ కమిషనర్ నరసయ్య మాట్లాడుతూ.. విద్యార్థినిలు తాము నేర్చుకున్న ఈ విషయాలన్నిటినీ తమ తల్లిదండ్రులకు బంధువులకు చేరవేసి ఏ ఒక్కరు కూడా ఆన్లైన్ మోసాలకు గురి కావద్దని కోరారు. అనంతరం విద్యార్థినిలకు డీసీపీ రాజ మహేందర్ నాయక్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సిఐ జానకిరామ్ రెడ్డి, కొడకండ్ల ఎస్సై రాజు, ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్, పోలీస్ సిబ్బంది, గురుకుల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

