గుడిసె వాసులపై సీపీఐ నేత ఆర్థిక అరాచకాలు

గుడిసె వాసులపై సీపీఐ నేత ఆర్థిక అరాచకాలు

  • ప్లాట్లు విక్రయం, అక్రమ వసూళ్లు,మహిళలను దుర్భాషలాడినట్లు ఆరోపణలు
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గుడిసె వాసులు
  • రాష్ట్ర కార్యదర్శికి గుడిసెవాసుల ఫిర్యాదు

నర్సంపేట,ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డుకు సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న గుడిసె వాసులపై జులుం ప్రదర్శిస్తూ ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్నాడనీ సీపీఐ నాయకుడు పంజాల రమేష్‌పై గుడిసెవాసులు తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా పార్టీ కార్యదర్శి సహాయ కార్యదర్శులను,ఇతర నేతలను పిలిపించి పంజాల రమేష్ సమక్షంలోనే అతడి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఏకరువు పెట్టారు. సంతకాలతో కూడిన ఫిర్యాదును రాష్ట్ర పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకి ఫిర్యాదు కూడా చేశారు.


సిపిఐ నాయకులు అక్కపెల్లి రమేష్ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నామని, అయితే తర్వాత కాలంలో పార్టీ నిర్మాణ బాధ్యుడిగా వ్యవహరిస్తున్న పంజాల రమేష్ గుడిసెల్లోకి వచ్చి అక్కపెల్లి రమేష్ తో సహా ఏ నాయకులను గుడిసెల దగ్గరకు రానీయకుండా చేసీ, పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని గుడిసె వాసులు ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులకు మూడు ప్లాట్లను కెటాయించుకోవడమే కాకుండా,ఒక్క ప్లాటునే రెండు లక్షల రూపాయల చొప్పున ఇద్దరు ముగ్గురికి విక్రయించాడని తెలిపారు.


ఎవరైనా గుడిసె వాసులు అవసరాలు నిమిత్తం కొన్ని రోజులు ఊరికి లేదా బయటకు వెళితే వారి ఇళ్లకు తాళాలు వేసి, రూ.10 వేల రూపాయలు ఇస్తేనే తాళం తీస్తున్నాడని ఆరోపించారు. మహిళలను అవమానకరంగా దుర్భాషలాడుతున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కరెంటు మీటర్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.7 వేల చొప్పున వసూలు చేసి ఇప్పటివరకు మీటర్లు ఏర్పాటు చేయలేదని, డీడీలు కూడా తీసుకోలేదని గుడిసె వాసులు తెలిపారు.


మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీతో మండల కమిటీతో సంబంధం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరిపి నామినేషన్లు వేసి తర్వాత ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల్లో గుడిసె వాసుల కాలనీ కీ ఏ పార్టీ వారిని రానివ్వకుండా తమ ప్రయోజనాలకోసం మాత్రమే ఇతర పార్టీలతో అంటకాగేవాడన్నారు.

ఇతనిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకొంటూ, మా దగ్గర వసూలు చేసిన డబ్బు తిరిగి ఇప్పించాలని, కోరినట్టు తెలిసింది. గుడిసె వాసుల మౌళిక సదుపాయాలు గురించి కానీ, పట్టాలు ఇప్పించడానికి మాత్రం ఎలాంటి కృషి చేయలేదనీ ఆ ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిసింది.

Leave a Reply