TG | ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

  • ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
  • హౌజింగ్‌, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్‌ అధికారుల డిప్యూటీ సీఎం సమీక్ష

పేదల సొంతింటి కల నిజం చేయాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సకల్పం పూర్తిస్థాయిలో నెరనెర్చే దాకా వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో లేని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని హౌజింగ్‌ శాఖ అధికారులకు ఆదేశించారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచే ఈ ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ, హౌసింగ్‌, ఐఅండ్‌పీఆర్‌ ఉన్నతాధికారులతో 2025-26 బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. వివాదాల కారణంగా కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూములు సాధించుకోవడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

సినిమా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సమాజ వికాసానికి దోహదపడే విధంగా లఘు చిత్రాలను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచనలను, ప్రభుత్వ పథకాలను లఘు చిత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు.

రాష్ట్ర రాజధాని హైదరబాద్‌ మహానగరం శరవేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ఔటర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ పేద, మధ్యతరగతి ప్రజల కోసం శాటిలైట్‌ టౌన్‌ షిప్‌ నిర్మాణాలపై హౌజింగ్‌ శాఖ దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎల్‌ఐజి, ఎంఐజి, హెచ్‌ఐజి ఇండ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, కావాల్సిన భూమి కొరకు రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపించి భూమిని సేకరించుకోవాలన్నారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల జాబితాను సేకరించి, ప్రతి నెల అద్దె చెల్లించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ ను ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్యం లేనటువంటి గ్రీన్‌ ఎనర్జీని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల భవనాలపై సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సంపద సృష్టించి ఆ సంపదను ఈ రాష్ట్ర ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రత్యామ్నాయ వనరులను సమీకరించడంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.

ఈ సమావేశంలో ఫైనాన్స్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, రెవిన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌, రెవిన్యూ సెక్రెటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్‌, హౌసింగ్‌ ఎండి గౌతమ్‌. ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *