హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని, ప్రజా సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ( Congress Party) కి కార్యకర్తలే ప్రభుత్వం తరపున ప్రచారకర్తలుగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ సామాజిక న్యాయ విజయభేరీ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు.
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, ఎంపీ సీట్లు పెరగబోతున్నాయని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలవబోతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తాయని, అందులో ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యత అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 15 లోక్‌సభ సీట్లు తప్పకుండా గెలుస్తామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తన ప్రసంగంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలను, కార్యకర్తలను ఉర్రూతలూగించారు. తమకు ఎదురులేదని భావించిన కల్వకుంట్ల గడీని బద్ధలు కొట్టామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామని, ఇదే తరహా పాలన రాబోయే రోజుల్లోనూ సాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని, తామంతా కొట్టుకుంటామని.. కలసి ఉండలేమని విపక్షాలు చేసిన ఆరోపణలను తప్పని నిరూపించామన్నారు. కాంగ్రెస్ నేతలు ఐకమత్యంతో పని చేస్తూ అపోహలను పటాపంచలు చేశారన్నారు.
రైతు రాజ్యం ఎవరు తెచ్చారో ఎక్కడైనా చర్చ చేసేందుకు సిద్ధం, చర్చకు ఎవరొస్తారో రండి.. కేసీఆర్, మోదీ, కిషన్‌రెడ్డి ఎవరొచ్చినా సరే.. మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం.. వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తున్నామన్నారు. జనగణనతో పాటు కులగణన చేస్తామని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో రాహుల్‌గాంధీ మాట ఇచ్చారని, హామీ ఇచ్చినట్టుగానే ఏడాదిలోపే కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 18 నెలల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ మోడల్ ఆవిష్కరించామన్నారు. ఈ సమయంలో కష్టాలు వచ్చాయని, ఒడిదొడుకులు వచ్చాయని, అయినా అన్నింటిని అధిగమించి ముందుకెళ్తున్నామన్నారు.
జై బాపు, జై భీం, జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం పార్టీ కార్యకర్తలేనని ప్రశంసించారు. రేవంత్‌రెడ్డి, భట్టి.. అందరూ కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, కేసీఆర్‌ను ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని కితాబిచ్చారు.
గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మోసం చేశారని ఖర్గే మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సన్నబియ్యం, రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.8,200 కోట్లు జమ చేశామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పార్టీ నెరవేరుస్తోందని తెలిపారు. దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని, బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని గుర్తుచేశారు.