వనపర్తి ప్రతినిధి, ఏప్రిల్ 30(ఆంధ్రప్రభ ) : యాసంగిలో కష్టించి పండించిన రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ధాన్యం రాశుల దగ్గర రైతుల పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని, రైతుల సమస్యలను మంత్రులు పట్టించుకోవడం లేదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నివాస గృహంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. యాసంగిలో పంటకు కరెంట్, సాగునీళ్ళు సరిగ్గా రాకపోయినప్పటికీ ఎంతో కష్టపడి పండించుకున్న ధాన్యం సకాలంలో కొనుగోలు జరగక రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
యాసంగి పంటలో ఎటువంటి తేమకానీ, తరుగు కానీ ఉండదని, అయితే రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ ఉందని, తాళ్లు ఉన్నాయని నానా అరిగోస పెడుతున్నారని వాపోయారు. కొనుగోలు కేంద్రాల వద్ద వేలకు వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కాక రైతులు పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. గన్ని బ్యాగులు లేవని కొన్నిరోజులు.. లారీలు రాలేదని కొన్ని రోజులు రైతులను నానా ఇబ్బంది పెట్టడాన్ని నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కొత్త గన్ని బ్యాగులు కొనుగోలు చేశామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో నాసిరకం బ్యాగుల వాడకం వల్ల అక్కడ కూడా తేమ, తాళ్ళు అంటూ తరుగు కోల్పోవడంతో రైతులు తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నారన్నారు.
రైతులు తూకం అయిపోగానే వాళ్ల పని అయిపోతలేదని, బ్యాగులు నింపి ట్రాన్స్ పోర్ట్ వరకు ఆగాల్సి వస్తుందని, వారికి సరైన సమయం అధికారులు చెప్పకపోవడం వల్ల రైతులు అన్ని పనులు వదులుకొని అక్కడ ఉండాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రులు, అధికారులు వెంటనే స్పందించి సకాలంలో మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ ను వదులుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు హరిగోస పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్.నందిమల్ల.అశోక్, ఇమ్రాన్, నారాయణ నాయక్, మాజీద్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.