కాంగ్రెస్ పాలనలో అధికారులు రాజ్యాంగాన్ని తొక్కుతూ అధికారులు పనిచేస్తున్నారని… బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్‌కుమార్‌లు రాష్ట్ర సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న వారిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ పై అభిమానంతో ఓ అభిమాని టీ షాప్ నిర్వహిస్తుండగా… ట్రేడ్ లైసెన్స్ లేదని షాప్ క్లోజ్ చేయడమే కాకుండా, వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని ఇబ్బందుల గురిచేస్తున్నారని అన్నారు.
స్వయంగా సిరిసిల్ల కలెక్టర్ అధికార దర్పంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం దుర్వినియోగం చేసి ప్రజల్ని భయపెడుతున్నారని అన్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా షాపును క్లోజ్ చేయడం ఏంటని ఆగ్రహించారు.
రాష్ట్రంలో అధికారుల పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. చర్యలు తీసుకుని నియంత్రించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. నియంత్రించకుంటే బీఆర్ఎస్ తరపున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.