Collectorate | కదంతొక్కిన మామిడి రైతులు

Collectorate | కదంతొక్కిన మామిడి రైతులు
- సమస్యలపై కలెక్టర్‌కు విన్నపం
- యాజమాన్యాలతో మరోసారి చర్చలకు కలెక్టర్ హామీ
Collectorate | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మామిడి రైతుల హక్కుల సాధన కోసం చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం సోమవారం ఘనంగా విజయవంతమైంది. వివిధ మండలాల నుంచి వందలాది మంది రైతులు అడ్డంకులను అధిగమించి కలెక్టరేట్‌కు చేరుకుని తమ గళాన్ని బలంగా వినిపించారు. మామిడి పరిశ్రమలు రైతులకు ఇవ్వాల్సిన ఎనిమిది రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి అన్న డిమాండ్ ఈ నిరసనకు కేంద్రబిందువుగా నిలిచింది.
మామిడి రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి, కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఏడు నెలలుగా నిలిపివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కొత్త సీజన్ ప్రారంభానికి ముందే పెట్టుబడులు అవసరమయ్యే ఈ సమయంలో డబ్బులు ఇవ్వకపోవడం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టడమేనని హెచ్చరించారు. ప్రభుత్వం 40 పరిశ్రమల పక్షమా, 40 వేల మామిడి రైతుల పక్షమా తేల్చుకోవాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఇచ్చిన రెండు, మూడు, నాలుగు, ఐదు రూపాయల తర్వాత మిగిలిన మొత్తం కూడా తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఏడాది మే నెలలోనే గుజ్జు పరిశ్రమలు ప్రారంభించాలని, టేబుల్ రకాల మామిడికాయలను రైతులు నేరుగా విక్రయించుకునేందుకు పట్టణాల్లో ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలని కోరారు. మామిడి అనుబంధ ఉత్పత్తుల తయారీకి కోల్డ్ స్టోరేజీలు, కుటీర పరిశ్రమలకు సహకారం అందించాలని వక్తలు సూచించారు. సీజన్ ముగిసిన తర్వాత మామిడి మండీల షెడ్లను రైతుల ఇళ్ల శుభకార్యాలకు, ఇతర పంటల ఒబ్బిడికి ఉచితంగా ఇవ్వాలన్నారు. కొమ్మ కత్తిరింపు, ఎరువులు, దున్నడం, మందుల పిచికారీ, కోత వంటి పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ—గుజ్జు పరిశ్రమల వద్ద నిల్వ ఉన్న మామిడి పల్పును తిరుమల తిరుపతి దేవస్థానాలు, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలకు సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిల్వ సరుకు అమ్ముడుపోయి యాజమాన్యాలపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.

రైతు సంఘం నాయకులు రామానాయుడు మాట్లాడుతూ గతంలో కలెక్టర్‌తో అనేకసార్లు చర్చించినా సమస్యలు పరిష్కారం కాలేదని, రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో రైతులే ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ శాంతియుత సమావేశాన్ని అడ్డుకోవడం, మైక్ పెట్టనివ్వకపోవడం, రైతులను చులకనగా మాట్లాడడం ఖండనీయమని అన్నారు. రైతుల సమస్యలను రాజకీయాలకతీతంగా పరిష్కరించాలని కోరారు. ఏఐటీయూసీ నాయకులు నాగరాజు మద్దతు ప్రకటించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఓబుల్ రాజు, జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షుడు కె.ఎస్. రామచంద్రన్, ప్రధాన కార్యదర్శి రవి తదితరులు సంఘీభావం తెలిపారు. కే. సురేంద్రన్, సంజీవరెడ్డి, మునిరత్నం నాయుడు, ఉమాపతి నాయుడు, సందీప్, మోహన్ రెడ్డి, త్యాగరాజు రెడ్డి, భారతమ్మ, చెంగల్ రాయరెడ్డి, జయదేవయ్య, బెల్లంకొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

సమావేశం అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన కలెక్టర్ గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో త్వరలోనే చర్చలు జరిపి మామిడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదే సందర్భంగా డి.డి. మధుసూదన్ రెడ్డి రైతుల వద్దకు వచ్చి వారి సందేశాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి 300 మందికి పైగా మామిడి రైతులు పాల్గొని తమ హక్కుల కోసం ఏకతాటిపై నిలిచారు. మామిడి రైతుల పోరాటం ప్రభుత్వంపై న్యాయమైన ఒత్తిడిగా నిలిచి, పరిష్కార దిశగా అడుగులు వేయాల్సిందేనని స్పష్టంగా చాటింది.
