Collector | రైతుబజారుల నిర్వహణలో పారదర్శకతను పాటించాలి

- ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేందించాలి
- ప్రత్యేక జూట్ క్లాత్ సంచుల స్టాలు ఏర్పాటు చేయండి
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
Collector | ఆంధ్రప్రభ, పటమట : రైతుబజారుల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వినియోగదారులకు సేవలందించాలని, రైతు బజార్లలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవాలని జూట్ క్లాత్ సంచుల అమ్మకాలకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు బజార్ల నిర్వహణ పరిశీలనలో భాగంగా గురువారం పటమట హైస్కూల్ రోడ్డులోని రైతు బజార్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కూరగాయల విక్రయ స్టాళ్లను ధరల పట్టికలను అమ్మకాలు నిర్వహిస్తున్న రైతుల గుర్తింపు కార్డులను కలెక్టర్ నిశితంగా పరిశీలించి వినియోగదారులతో మాట్లాడి రైతు బజారు నిర్వహణపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను నిర్దేశ రేట్ల ప్రకారం అందించాలన్నారు. కూరగాయల రేట్లకు సంబంధించిన బోర్డులు వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మకందారులు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి రైతుబజార్ల ప్రతిష్టను పెంచాలన్నారు. రైతులకు కేటాయించిన స్టాల్స్ వారే విక్రయాలు నిర్వహించాలని, ఇతర వ్యక్తులు అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే ఎస్టేట్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమన్నారు. స్టాళ్లను ఏ కేటగిరీ కింద కేటాయించారు? ఎవరికి కేటాయించారు? తదితర వివరాలతో కూడిన బోర్డును ప్రతి స్టాల్లో ప్రదర్శించాల్సిందేనన్నారు.

విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దని, రైతు బజార్ల నిర్వహణ విషయంలో పారదర్శకత లోపించినా ఎస్టేట్ అధికారులను బాధ్యులను చేస్తామన్నారు. ప్లాస్టిక్ బ్యాగుల విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ప్లాస్టిక్ వినియోగం దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వాడకం 80 శాతం వరకు తగ్గిందన్నారు. దీనిని పూర్తిగా నివారించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రైతు బజార్లు లోపల, బయట ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేందించాలన్నారు.
వినియోగదారులు సౌకర్యార్ధం నార గుడ్డ సంచులు అమ్మకాలు నిర్వహించేందుకు రైతుబజార్లలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని ఎస్టేట్ అధికారికి సూచించారు. నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ సంచుల విక్రయం, వాడకదారులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. రాజబాబు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఎం. రమేష్‌బాబు, నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ కె. సంజయ్, జోనల్ కమీషనర్ షమ్మి, హెల్త్ ఆఫీసర్ డా. గోపాలా నాయక్, సిఇ సత్య కుమారి, ఎసిపి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
