భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
- 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు
- జిల్లాలో 21 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రాయనున్న విద్యార్థులకు జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు.
పరీక్షలకు ముందు సరైన ప్రణాళికతో చదవడం, సమయపాలన పాటించడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు చేసిన చదువుపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించగలరన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వారికి అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 21 పరీక్షా కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించామని, విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 10వ తరగతి పట్టా విద్యార్థుల జీవితంలో తొలి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని, ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
