గ్రీన్లాండ్స్ కాపాడాలని గ్రీవెన్స్ లో శ్రీధర్ వినతి..

గ్రీన్లాండ్స్ కాపాడాలని గ్రీవెన్స్ లో శ్రీధర్ వినతి..
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు
అడ్డుకోవాల్సిన అధికారులు అండగా నిలుస్తున్నారు
గ్రీన్ ల్యాండ్ లో చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి
కలెక్టర్ సత్యశారదకు కౌన్సిలర్ శ్రీధర్ వినతి
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ భూములను, గ్రీన్ ల్యాండ్ స్థలాలను కాపాడాలని,చిలువేరు వరమ్మ తోట గ్రీన్ ల్యాండ్ స్థలంపై కొంతమంది మున్సిపాలిటీ నుండి ఇంటి నెంబర్లు తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాటిని రద్దు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదకు పదవ వార్డు కౌన్సిలర్ సిపిఎం పట్టణ కార్యదర్శి హనుమకొండ శ్రీధర్ వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి, 10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ భూమిలో అంతస్తులమీద అంతస్తులు నిర్మాణాలు చేస్తుంటే స్థానిక రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నరని అన్నారు. అనుమతులు లేవని చెప్తూనే వారి అక్రమ నిర్మాణాలకు లోపాయికారంగా సహకారం చేస్తున్నారని అన్నారు.
గ్రీన్ ల్యాండ్ స్థలాలను కొంత మంది అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసుకొని కొనుగోలు, అమ్మకాలకు పాల్పడుతున్నారని,వారి అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు కలెక్టర్ ను కోరారు. పట్టణం లో ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని నిర్మాణాలను తొలగించాలని, అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
హనుమకొండ శ్రీధర్ వినతిపట్ల స్పందించిన కలెక్టర్ సత్య శారద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వై వి గణేష్ ను స్థానిక ఆర్డీవో ఉమారాణిని విచారణ చేసి నివేదిక సమర్పించాలని వారు సూచించడం హర్షించదగ్గ అంశం అని అన్నారు.
