Collector | పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలు..

Collector | పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలు..

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

Collector | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలు గా నిలవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. బుధవారం కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్య సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమాఖ్య సభ్యులతో సంభాషించారు. సంఘాల మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంచుకొని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ సూచించారు.

మహిళా సంఘాలు కేవలం రుణాలు తీసుకునే వేదికగా కాకుండా, గ్రామాభివృద్ధికి దారితీసే చైతన్య వేదికలుగా మారాలని పేర్కొన్నారు. గ్రామంలోని పొదుపు మహిళలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, సమాజంలో మంచి మార్పుకు కారకులవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల నిర్వహించే సమీక్ష సమావేశాల్లో వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా గ్రామం, సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించి, తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, గర్భిణీల ఆరోగ్యం, విద్య ప్రాధాన్యం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

అక్షరాంధ్ర కార్యక్రమంపై ప్రత్యేకంగా చర్చిస్తూ గ్రామంలో ఎంతమంది నమోదు అయ్యారో వివరాలు తెలుసుకున్నారు. చదువురాని ప్రతి ఒక్కరూ సాయంత్రం బడికి హాజరై అక్షరాభ్యాసం నేర్చుకోవాలని సూచించారు. చదువు వల్ల వ్యక్తిగత గౌరవం పెరుగుతుందని, మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడగలరని తెలిపారు. ప్రతి ఒక్కరికి అక్షరాస్యత కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతం కావడంతో ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు.

Collector |

రసాయన రహిత వ్యవసాయం ద్వారా ఆరోగ్యం, ఆదాయం రెండూ మెరుగవుతాయని చెప్పారు. కొన్ని ఇళ్లలో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయడం అభినందనీయం అని, మరిన్ని కుటుంబాలు కూడా వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రక్తహీనత నివారణకు పౌష్టికాహారం, ఐరన్ మాత్రల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి ఆదేశించారు.

గ్రామాభివృద్ధి కోసం మహిళల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, సంఘాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావాలని కలెక్టర్ మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి రమణారెడ్డి, తహశీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో నాగశేషాచలారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply