Collector | సానుకూల దృక్పథం పెంచాలి

Collector | సానుకూల దృక్పథం పెంచాలి
- అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
Collector | గుంటూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల సానుకూల దృక్పథం పెరగాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజల సానుకూల దృక్పథం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్) పై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో అమలు పక్కాగా ఉండాలని, అందుకు తగిన పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
మంచి పర్యవేక్షణ చేయడం వలన పరిస్థితుల్లో మార్పులు వస్తాయని స్పష్టం చేశారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో గుర్తించాలని, వాటిని పరిష్కరించుకుంటూ పథకాలు, కార్యక్రమాలు, సేవలు చక్కగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారా ఉద్యోగ నిర్వహణలో సంతృప్తి లభిస్తుందని ప్రతి ఉద్యోగి గుర్తించాలని ఉద్బోధించారు. ప్రజలకు మంచి సేవలు అందించడం బాధ్యతగా భావించాలని అన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిగ్రీ కళాశాలలలో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి వలన ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులు త్వరలో పరీక్షలు రాయనున్నారని, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులతో ముఖాముఖి మాట్లాడి ఎక్కువ మంది విద్యార్థులు చేరుటకు కృషి చేయాలని ఆదేశించారు. మంచి ఫలితాలు తీసుకురావడం వలన భవిష్యత్తులో ఎక్కువ మంది చేరుటకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న సరుకులు ప్రజలకు సకాలంలో అందడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ప్రజలకు రేషన్ అందటం వలన సానుకూల దృక్పథం ఏర్పడుతుందని చెప్పారు. ప్రతి నెల 26 నుండి 30వ తేదీ వరకు వృద్ధులకు, దివ్యాంగులకు విధిగా ఇంటి వద్ద రేషన్ అందించడం వలన సానుకూల దృక్పథం పెరుగుతుందని అన్నారు.
గృహ నిర్మాణ లబ్ధిదారులను చైతన్య పరచాలని, వారికి చెల్లించే బిల్లుల చెల్లింపు వివరాలు తెలియజేయాలన్నారు. తద్వారా త్వరగా గృహ నిర్మాణ ప్రక్రియ పూర్తి కాగలదని ప్రజల సానుకూల దృక్పథం పెరగగలదని పేర్కొన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండటంతో పాటు, సిబ్బంది అందుబాటులో ఉండి, కాల్ అందిన వెంటనే సమస్య పరిష్కారం చేయడం వలన విద్యుత్ విభాగంలో సానుకూల దృక్పథం పెరగ గలదని సూచించారు.
డిగ్రీ కళాశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కళావతి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెంచుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్, సి.పి.డి.సి.ఎల్ ఎస్.ఇ రమేష్, గనుల శాఖ ఉప సంచాలకులు ఎన్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
