ఎండల్లో ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఎండల్లో ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కూలీలకు నీడ, నీరు, మెడికల్ కిట్ తప్పనిసరి
రోజుకు 77 వేల మంది హాజరు *నెలాఖరుకు 19 లక్షల పనిదినాల లక్ష్యం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఉపాధి హామీ పనుల వేగం పెంచేందుకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ బుధవారం బుక్కపట్నం మండలం బుక్కపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని కువ్వకొండ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంగమ్మ మూల ప్రదేశంలో కొనసాగుతున్న ఖండిత కందకాల (ఎస్టీ) పనులను స్వయంగా పరిశీలించి, కూలీల హాజరు పట్టికతో పాటు క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను అంచనా వేశారు.
ఈ సందర్భంగా కూలీలతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పని ప్రదేశంలో నీడ, తాగునీరు, మెడికల్ కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ట ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నిర్దేశించిన టార్గెట్ మేరకు ప్రతిరోజూ 77 వేల మంది కూలీలు హాజరయ్యేలా చూడాలని, నెలాఖరుకు 19 లక్షల పనిదినాలు పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఉపాధి పనులు నిబంధనల ప్రకారం పారదర్శకంగా, వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ తనిఖీల్లో డిడబ్ల్యూఎంఏ పీడీ విజయేంద్ర ప్రసాద్, పుట్టపర్తి క్లస్టర్ ఏపీడీ వి. రమేష్ బాబు, ఏపీఓ శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మంజునాథ్, ప్లాంటేషన్ సూపర్వైజర్, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.
