TG | నీటి విష‌యంలో సీఎం నీచ రాజ‌కీయం.. ఎమ్మెల్సీ క‌విత‌

  • తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో రౌండ్‌టేబుల్ స‌మావేశం
  • నీళ్లు -నిజాలు అనే అంశంపై చ‌ర్చ‌
  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కాపాడాలి
  • ఆదిత్యానాథ్ దాస్‌ను బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాలి
  • జ‌ల వ‌న‌రుల రంగాన్ని విస్మ‌రిస్తున్న కాంగ్రెస్‌
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌


హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నీటి విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం నీచ రాజ‌కీయం చేస్తోంద‌ని, రాజ‌కీయాలు చేయ‌డం మానేసి నిజాలు చెప్పాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. శుక్ర‌వారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు – నిజాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బురదరాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ మ‌గధీరుడిలా నిలబడింద‌న్నారు. మాజీ సీఎం కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల‌ని కోరారు.

కేసీఆర్ ప్రారంభించిన ప‌నుల‌ను పూర్తి చేయాలి…
వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య‌శ్రీని కేసీఆర్‌ కొన‌సాగించార‌ని, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ ప‌థ‌కాన్ని బీజేపీ కొన‌సాగిస్తోంద‌ని, అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాల‌ని క‌విత సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్ లా పనిచేస్తున్నార‌ని, కేసీఆర్‌ను శ‌త్రువుగా చూస్తున్నార‌ని ఆరోపించారు. మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శ‌త్రువుల‌ని ఆయన గమనించాల‌న్నారు.

ఆదిత్యానాథ్ దాస్‌ను బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాలి…
ఆంధ్ర కేడర్ లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ ను బాధ్యతల నుంచి త‌ప్పించాల‌ని క‌విత డిమాండ్ చేశారు. కృష్ణ ట్రిబ్యునల్ లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాల‌న్నారు. కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తేనే కోటి ఎకరాల మాగాణంగా మారింద‌ని గుర్తు చేశారు. ఎంతో మంది మేధావులు, ఇంజనీర్ల కృషి ఫలితమే అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్టామ‌ని, తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లామ‌ని చెప్పారు.

జ‌ల వ‌న‌రుల రంగాన్ని విస్మ‌రిస్తున్న కాంగ్రెస్‌..
కాంగ్రెస్‌ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విస్మ‌రిస్తోంద‌ని, ఉమ్మడి రాష్ట్రంలో 60ఏళ్లలో కేవలం 50లక్షల ఎకరాలకు నీళ్లందించారని క‌విత విమ‌ర్శించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో కోటి ఎకరాలకు పైగా నీళ్లందించామ‌న్నారు. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని, కోటి 24లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశామ‌ని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా 15లక్షల లీట‌ర్ల నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌న్నారు. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నామ‌న్నారు. తెలంగాణ ఏర్పడే సమయానికి 68లక్షల టన్నుల వరి పండితే… 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండించి, వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి ఎదిగింద‌న్నారు.

ఇన్ని చేసినా…
ఇన్ని చేసినా పదేళ్లలో ఏమి జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయ‌డం సిగ్గు చేటని క‌విత విమ‌ర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ శ్ర‌మించార‌న్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పరిపాలించి ప్రాజెక్టుల్లో పల్లేర్లు మొలిపించార‌ని, కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పైర‌వీలు చేసుకున్నారు తప్పా ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదన్నారు.

ఆంధ్ర‌కు మేలు చేసిన ప్రాజెక్టులు…
వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్రా ప్రాంతానికి మన జలాలను తరలించార‌ని క‌విత గుర్తు చేశారు. అదే ఒరవడిని జగన్, చంద్రబాబు కొనసాగించార‌న్నారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రాయలసీమ, బనకచర్ల ప్రాజెక్టులను చేపడుతున్నాయ‌ని తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయనుకుంటే… ఇప్పుడు వాటికి బీజేపీ తోడయ్యింద‌న్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలను మోహరింపజేశార‌ని, కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది లని అన్నారు. జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారని, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టార‌ని, బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయ‌ని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేద‌ని విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *