CM Revanth | ప్రభుత్వ నిర్లక్ష్యం… ఇబ్బందుల్లో రైతాంగం

CM Revanth | ప్రభుత్వ నిర్లక్ష్యం… ఇబ్బందుల్లో రైతాంగం
- కొనుగోలు కేంద్రం పరిశీలించిన హరీశ్‌రావు
Siddipet | చిన్నకోడూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్లే రైతాంగం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు(MLA T. Harish Rao) అన్నారు. ఈ రోజు మల్లారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం ఐదారు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే అన్నారు. ఆయన మాటల్లో…
వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పింది 85 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ఐదు ఆరు లక్షలకు మించి కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసిన వాటికి బిల్లులు కూడా చెల్లించలేదు. దాదాపు రూ.1200 కోట్ల వరకు ఎంఎస్‌పీ పెండింగ్(MSP Pending)లో ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది.
మాటల్లో 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలి. వెంటనే వడ్లను కొనుగోలు వేగవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ చలి పెరిగిపోతుంది. ఈ క్రమంలో వడ్లు అమ్మకానికి రాత్రి పగలు పడిగాపులు కాస్తున్నారు. వెంటనే కొనుగోలు చేయాలి.
మక్క రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మక్క కొనుగోల్లను ఆలస్యం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మక్కల కొనుగోలును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎకరాల్లో మక్కలు పండించారు. మక్క రైతులకు డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగం అయ్యింది. కేంద్ర బీజేపీ రైతులను అరిగోస పెడుతున్నది. ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటాం అంటే కొన్ని జిల్లాలో 11, 12 క్వింటాళ్ల పత్తి పండింది. వాళ్లు మిగిలిన పత్తిని ఏం చేయాలి? ఒకవైపు జిన్నింగ్ మిల్ వాళ్ళు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సీసీఐ(Central Govt CCI) పత్తి కొనుగోలు సరిగ్గా చేయడం లేదు. పత్తి రైతులు అప్పులపాలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. పత్తి రైతులకు బీజేపీ ప్రభుత్వం, మక్క రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది.
సీఎం రేవంత్ రెడ్డి రైతులను అన్ని రకాలుగా మోసం చేశాడు. రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు.. బోనస్(Bonus) లేదు, పంటల బీమా లేదు.. సగం మందికే రుణమాఫీ చేశారు. పోయిన యాసంగిలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు, ఈ ఏడాది తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. పంటల బీమా చేసి ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేవి కాదు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
