లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్

లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్

చాట్రాయి, తోట్లవల్లూరు, కాటూరు బ్రాంచ్‌లలో 100% వసూళ్లు
రైతు సంక్షేమమే కేడీసీసీ బ్యాంక్ లక్ష్యం
కేడీసీసీ చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లాభాల బాటలో దూసుకుపోతూ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం తెలిపారు. గురువారం మచిలీపట్నంలోని కేడీసీసీ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే తమ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ముఖ్యంగా సన్న, చిన్న రైతులకు ఆర్థికంగా అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తయిందని, ఈ కాలంలో బ్యాంక్ అభివృద్ధిలో సీఈఓ, సిబ్బంది అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

బ్యాంక్ ఆర్థిక స్థితిగతుల వివరాలు..

బ్యాంక్ షేర్ క్యాపిటల్ రూ.453.94 కోట్లు, రిజర్వ్ ఫండ్ రూ.443.95 కోట్లతో కలిపి మొత్తం సొంత నిధులు రూ.897.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది గతంతో పోలిస్తే 12.2% వృద్ధిని సూచిస్తుందని తెలిపారు.

మొత్తం డిపాజిట్లు..

కేడీసీసీ బ్యాంకులో ఇప్పటివరకు రూ.3,850.76 కోట్లు, లోన్లు అడ్వాన్సులు రూ.8,618.63 కోట్లు కాగా, మొత్తం వ్యాపారం రూ.12,469.39 కోట్లకు చేరింది. ఇది 7.17% వృద్ధిని నమోదు చేసిందన్నారు.

బ్యాంక్ బారోయింగ్స్…

గత ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేడీసీసీలో రూ.6,646.38 కోట్లకు చేరి 1.54% వృద్ధిని సాధించగా, ఇన్వెస్ట్మెంట్లు రూ.2,008.63 కోట్లకు చేరి 13.36% వృద్ధి సాధించాయి. వడ్డీ ఆదాయం రూ.948.17 కోట్లకు చేరి 4.76% వృద్ధి నమోదైంది. మిస్సిలేనియస్ ఆదాయం రూ.19.48 కోట్లు గా ఉంది.

ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు..

కృష్ణాజిల్లా కోపరేటివ్ బ్యాంకులో రూ.91.26 కోట్లు, ఆపరేటింగ్ ఖర్చులు రూ.52.78 కోట్లు కాగా, ట్యాక్స్ ముందు లాభం రూ.105.99 కోట్లకు చేరి 4.88% వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చాట్రాయి, తోట్లవల్లూరు, కాటూరు శాఖలు 100% వసూళ్లు సాధించడం అభినందనీయమని, అందుకు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే, వారం రోజుల్లోనే తిరిగి రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. పంట రుణమాఫీ కింద జూన్ 30 లోపు క్లెయిమ్ చేయాలని రైతులకు సూచించారు.

అదనంగా, రైతుల సంక్షేమం కోసం డెత్ క్లెయిమ్స్‌ను సకాలంలో పరిష్కరించడమే కాకుండా, జీవిత బీమా సదుపాయం కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల మరణించినట్లయితే, వారి కుటుంబాలకు రూ.10,000 వరకు అంత్యక్రియల ఖర్చులను కూడా అందజేస్తామని పేర్కొన్నారు. రైతులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను క్రమం తప్పకుండా రీన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంక్ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేసిన సిబ్బందికి ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

తమ హయాంలో కేడీసీసీ బ్యాంకును మరింత లాభాల దిశగా తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. డిపాజిట్ల సేకరణలో కూడా బ్యాంక్ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్, జీఎం చంద్రశేఖర్, రంగబాబు సహా ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply