Chittoor | పోరాటమే శరణ్యం

Chittoor | పోరాటమే శరణ్యం

  • వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కార‌మే ల‌క్ష్యం
  • ఏ.పీ. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. బాలరాజు నాయుడు పిలుపు

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులోని చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ఎర్రజెండాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. బాలరాజు నాయుడు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బాలరాజు నాయుడు, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్. నాగరాజు మాట్లాడారు. ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ స్థాపితమైన నాటి నుంచి నేటి వరకు ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల నుంచి డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు సహా అన్ని కేటగిరీలకు చెందిన వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు.

వైద్య ఉద్యోగుల వేతనాలు, సేవా నిబంధనలు, చట్టబద్ధ హక్కులు, రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయించడంలో యూనియన్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించేందుకు కూడా నిరంతరం ఉద్యమాలు కొనసాగించిందని గుర్తు చేశారు. వైద్య ఉద్యోగుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ నాయకత్వంలో ఏ.పీ. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ అగ్రభాగాన నిలిచిందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏ.పీ. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి చంద్ర, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ నాయకుడు శ్రీనివాసమూర్తి, చిత్తూరు బ్రాంచ్ అధ్యక్షుడు సి. జయచంద్ర, జిల్లా అధ్యక్షుడు కే. వెంకటేష్, జిల్లా కార్యదర్శి కే. రాధా పాల్గొన్నారు. అలాగే సిస్టర్స్ యూనియన్ నాయకులు బేబీ, పూమాల, రాణి, సరిత, దిల్షాద్, ఏఐటీయూసీ నగర నాయకురాలు కె. రమాదేవి, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మణికంఠ, శంకర్, హరి తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు ఆగవని, అవసరమైతే మరింత ఉధృత ఉద్యమాలకు సిద్ధమని నాయకులు స్పష్టం చేశారు.

Leave a Reply