Chittoor | ప‌శు ఆరోగ్యంపై అవగాహన

Chittoor | ప‌శు ఆరోగ్యంపై అవగాహన

  • జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: పాడి రైతులకు పశు ఆరోగ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో 374వ యోగి వేమన జయంతి సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, పశు వైద్య శిబిరాలకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 19 నుంచి 31 వరకు జిల్లాలోని 32 మండలాల్లోని 697 గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరాల ద్వారా రైతులకు పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, చికిత్సలపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ శిబిరాల్లో పశువైద్య చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్స, కృత్రిమ గర్భధారణ సేవలు, పశువ్యాధుల నిర్ధారణ పరీక్షలు వంటి సేవలు అందించనున్నట్లు కలెక్టర్ వివరించారు. పశువుల ఆరోగ్యం బాగుంటేనే పాడి రైతులకు ఆదాయం పెరుగుతుందని, అందుకే ప్రతి రైతు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని పాడి రైతులందరూ ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్ కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ ఉమామహేశ్వరి, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply