వికారాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రప్రభ) : జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ చీమలగిరిలో అమలుచేసిన బ్రాడ్ బ్యాండ్ సేవలను దేశ స్థాయిలో అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని టెలికాం జాతీయ కార్యదర్శి నీరజ్ మిట్టల్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా మమింపేట మండలం చీమలదరి గ్రామాన్ని బీఎస్ఎన్ఎల్ అధికారులతో కలిసి సందర్శించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలో గతంలో ఉన్న బ్రాడ్ బ్యాండ్ సేవలు తగ్గడంలో కారణమేమిటని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వినియోగదారుడు నెలవారీ చార్జీలు అధికంగా ఉన్న కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఈ విషయమై ఆలోచించి నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఈ ప్రాంత ప్రజలు జీవనం సాగిస్తారనే విషయాన్ని ఆయన గుర్తించారు. ఈకార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ అధికారులు, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.