హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసన మండలి ఎల్లుండికి వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం 11:14 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సుమారు గంటా 45 నిమిషాలపాటు బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెట్ అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తిరిగి శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. మరో వైపు శాసన మండలి సైతం శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ స్పీచ్ పూర్తయిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రకటించారు.
భట్టిని అభినందించిన సీఎం రేవంత్
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. బుధవారం ఉదయం 11;05 గంటలకు ప్రారంభమైన భట్టి బడ్జెట్ ప్రసంగం మధ్యాహ్నం 12:48 గంటలకు ముగిసింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రసంగం తర్వాత రేవంత్ రెడ్డి అభినందించారు. తోటి మంత్రులు కూడా ఒకరినొకరు భట్టిని అభినందించారు.