వికారాబాద్లో కెమిస్ట్ అసోసియేషన్ ర్యాలీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (రిజిస్టర్డ్) అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీ చౌరస్తా నుండి సత్యభారతి ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ సాగింది.
ఈ ర్యాలీలో జిల్లా డీఎంఅండ్హెచ్ఓ స్వర్ణకుమారి, అదనపు ఎస్పీ రాములు నాయక్, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వంకదారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్ఓ స్వర్ణకుమారి మాట్లాడుతూ ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అసోసియేషన్ సభ్యులు సహకరించాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ యజమానులు మందులు విక్రయించకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మకర శ్రీనివాస్, మోని, పండరినాథ్, గ్యాస్ సునీల్ తదితరులు, మెడికల్ షాప్ యజమానులు మరియు సభ్యులు పాల్గొన్నారు.
